రుద్ర పార్కులో కార్తీక వన భోజనాలు
శ్రీశైలం: దేవస్థాన ఉద్యోగులకు రుద్ర పార్కులో శుక్రవారం కార్తీక వనభోజనాలను ఏర్పాటు చేశారు దేవస్థానం ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పి రమేష్ మాట్లాడుతూ.. వైదిక సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణలో భాగంగా వనసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో వనభోజనాలు ఆచరించడంతో రెట్టింపు ఫలితం లభిస్తుందన్నారు. శ్రీశైలాన్ని క్షేత్రంగానే కాకుండా గొప్పతీర్థంగా కూడా మన పురాణాలు చెబుతున్నాయని పేర్కొన్నారు.
మందుబాబులకు వినూత్న శిక్ష
ఆళ్లగడ్డ: మద్యం తాగి వాహనాలు నడిపిన వారికి ఆళ్లగడ్డన్యాయస్థానం వినూత్న శిక్ష విధించింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఆళ్లగడ్డ రూరల్ పోలీసులకు మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 9 మంది పట్టుబడ్డారు. వీరిని శుక్రవారం కోర్టులో హాజరు పరచగా మద్యం అనర్థాలు, రహదారి నిబంధనలపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ బహిరంగ ప్రదేశాల్లో నిల్చోవాలని తీర్పునిచ్చింది. ఈ మేరకు రూరల్ పోలీసులు నిందితులతో పట్టణంలోని నాలుగు రోడ్లకూడలితో పాటు పలు బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శన చేయించారు. రూరల్ ఎస్‌ఐ వరప్రసాద్ మాట్లాడుతూ.. మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే తల్లిదండ్రులు, వాహన యజమానులు బాధ్యులు అవుతారన్నారు.
వైఎస్సార్‌సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా ఇక్బాల్ బాషా
కర్నూలు (టౌన్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పాణ్యానికి చెందిన ఎస్. ఇక్బాల్ బాషాను నియమించారు. అలాగే కళాకారుల విభాగం ఆలూరు, కర్నూలు నియోజకవర్గ స్థాయి అధ్యక్షులుగా వడ్ల మల్లికార్జున ఆచారి, కన్నా ప్రదీప్‌ను నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది.
గోనెగండ్లలో డెంగీ కేసు
గోనెగండ్ల: మండల కేంద్రం గోనెగండ్ల ఎస్సీ కాలనీలో 34 ఏళ్ల వ్యక్తి డెంగీ బారిన పడ్డాడు. గత కొన్ని రోజులుగా జ్వరం రావడంతో స్థానికంగా వైద్యం చేయించుకున్నాడు. అయినా తగ్గకపోడంతో కర్నూలు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించగా డెంగీ వ్యాధి సోకినట్లు తెలిసింది. దీంతో జిల్లా మలేరియా సబ్‌యూనిట్ అధికారి విజయ్ కుమార్, సబ్ యూనిట్ ఆఫీసర్ కృష్ణుడు గోనెగండ్ల వైద్య సిబ్బంది శుక్రవారం డెంగీ సోకిన వ్యక్తి ఇంటి ప్రాంతంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. కాలనీవాసులకు రక్త పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.
రుద్ర పార్కులో కార్తీక వన భోజనాలు


