
శాస్త్రోక్తంగా పల్లకీ సేవ
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు శుక్రవారం పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పల్లకీ సేవ నిర్వహించారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో ఉత్సవమూర్తులను ఉంచి వేదమంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాలతో ఆలయ ప్రదక్షిణ చేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
వీరారెడ్డి ఇంట్లో సోదాలు
దొర్నిపాడు: వెల్త్ అండ్ హెల్త్ స్కీంలో భాగంగా దొర్నిపాడులో చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాల పేరిట మోసపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యుడు వీరారెడ్డి ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో ఆదివారం డీఎస్పీ ప్రమోద్ బృందం సోదాలు చేశారు. తనిఖీల్లో ప్రామీసరి నోట్లు, విలువైన ఆస్తి పత్రాలు, ప్రింటర్లు, ల్యాప్‌టాప్‌లు దొరికినట్లు తెలిసింది. బాధితుల నిరసన తెలుపుతున్న సమయంలో సమస్య పరిష్కారానికి రెండు వారాలు గడువు ఇవ్వాలని కోరడంతో నిరసనను విరమించారు. డీఎస్పీ వెంట సీఐలు మురళీధర్‌రెడ్డి, హనుమంత్‌నాయక్, ఎస్‌ఐలు రామిరెడ్డి, వరప్రసాద్ ఉన్నారు.
గైనకాలజీ పీజీ సీట్లు పెరుగుదల
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు మెడికల్ కాలేజిలో గైనకాలజీ విభాగానికి మరో నాలుగు పీజీ సీట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఈ విభాగంలో 18 పీజీ సీట్లు ఉండగా పెరిగిన నాలుగు సీట్లతో కలిపి 22కు చేరాయి.
కర్నూలు సిటీ: ఉమ్మడి సర్వీసు రూల్స్‌ను ప్రభుత్వం అమలు చేయాలని ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఓంకార్ యాదవ్ కోరారు. ఆదివారం ఏపీ హెచ్‌ఎంఏ భవనంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వై.నారాయణ అధ్యక్షతన వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. క్లస్టర్ ప్రధానోపాధ్యాయుల పోస్టులను గ్రేడ్ –1గా ఉన్నతీకరించాలన్నారు. ప్రతి ఉన్నత పాఠశాలకు ఒక డిజిటల్ అసిస్టెంట్‌ను కేటాయించి ప్రధానోపాధ్యాయులకు పని భారం తగ్గించాలని కోరా రు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఆయాలు, వాచ్‌మెన్ల వేతనాలు రెగ్యులర్‌గా చెల్లించాలని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న వంట సహాయకులను విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు పెంచాలని, 9, 10 తరగతుల విద్యార్థుల మెస్ బిల్లులు చెల్లించాలన్నారు. ఆ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు పి.చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి హుసేన్, ఆర్థిక కార్యదర్శి రమేష్ నాయుడు, కార్యవర్గ సభ్యులు రమేష్, శ్రీనివాసయాదవ్, రామచంద్రారెడ్డి, అస్లాం, ఎంఈఓ–2 ఆదాం బాషా, తదితరులు పాల్గొన్నారు.

శాస్త్రోక్తంగా పల్లకీ సేవ