
పీపీపీతో మెడికల్ కళాశాలలు బినామీలకు ధారాదత్తం
● జేబులు నింపుకునేందుకు
కూటమి నేతల కుట్ర
● ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా
బొమ్మలసత్రం: ప్రభుత్వ మెడికల్ కళాశాలలను బినామీలకు ధారాదత్తం చేసేందుకు కూటమి నేతలు పీపీపీ విధానాన్ని తెరపైకి తెచ్చారని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా విమర్శించారు. స్థానిక కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. విద్య, వైద్య విధానాల్లో దేశంలోనే కనీవినీ ఎరుగని రీతిలో మార్పులు తీసుకొచ్చిన ఘనత ఒక్క వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో నూతనంగా 17 మెడికల్ కళాశాలల నిర్మాణం చేపట్టి ఐదు ప్రారంభించారన్నారు. పాడేరు లోని మెడికల్ కాలేజీ ఇటీవల ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం నిర్మా ణం పూర్తి దశ లో ఉన్న 11 మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. జేబులు నింపుకునేందుకు కూటమి నేతలు బరితెగించారన్నారు. ఎన్నికల ముందు సంపద సృష్టిస్తామని చెప్పిన వారు నేడు సూపర్‌సిక్స్‌ను అమలు చేయాలంటే తమ వద్ద అంత సంపద లేదని చెబుతుండటం పేదలను మోసం చేయడమేనన్నారు. వివిధ దశల్లో ఉన్న 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు రూ. 5 వేల కోట్లు అవసరం ఉందని, ఆ నిధులను సమకూర్చకుండా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టాలను కోవడం ఎంత వరకు సమంజసమన్నారు. పేదల కోసం తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎందాకైనా పోరాడతారని, ప్రభుత్వ కళాశాలలను ప్రైవేటు పరం చేసినా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేస్తారన్నారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంతో కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు.