
మోదీ పర్యటనలో భద్రత డొల్ల
ఆత్మకూరురూరల్: అత్యున్నత స్థాయి భధ్రతా వలయంలో ఉండే దేశ ప్రధాని సమీపంలోకి టాంపర్ పాస్‌లతో ఇద్దరు వ్యక్తులు వెళ్లడం సంచలనంగా మారింది. వీవీఐపీల భధ్రత ప్రమాణాలపై పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. ఈ అంశంపై మరింత లోతుగా పరిశీలిస్తే మరిన్ని భధ్రతా లోపాలు బయటపడుతున్నాయి. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటనలో పాల్గొన్న కొందరు రెండు పాస్‌లు కలిగి ఉండి వేర్వేరు చోట్ల ఆయనకు దగ్గరగా వెళ్లారు. జిల్లా భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు గుండాల మధుసూదన్ రావు పేరుతో ఒక పాస్ తీసుకుని సున్నిపెంట హెలిపాడ్ వద్ద ప్రధానిని స్వాగతించాడు. అలాగే అభిరుచి మధు పేరుతో మరొక పాస్ తీసుకుని ప్రధానికి హెలిపాడ్ వద్ద వీడ్కోలు పలికారు. అలాగే మోమినా షబానా స్టేట్ బీజేపీ మైనార్టీ మోర్చా ఇన్‌చార్జ్‌గా ఒక పాస్ పొంది శ్రీశైలంలోని శ్రీభమరాంబా ఆలయం వద్ద ప్రధానికి స్వాగతం పలికే బృందంలో ఉన్నారు. అలాగే మోమిన్ షబానా బీజేపీ శ్రీశైలం నియోజకవర్గ ఇన్‌చార్జ్ పేరుతో మరో పాస్ తీసుకుని సున్నిపెంట హెలిపాడ్ వద్ద ప్రధానికి వీడ్కోలు పలికే బృందంలో చేరారు. ఇంత సులువుగా రెండు పాస్‌లు పొంది రెండు వేర్వేరు చోట్ల ప్రధానికి అత్యంత సమీపంలో సంచరించే అవకాశం పొందడం వీవీఐపీ భద్రత లోపాన్ని కళ్లకు కట్టినట్లు చూపుతోంది. అలాగే ముఖ్య నాయకుల పేర్లను వాడుకుని పాస్‌లు పుట్టించుకుని ఇతరులు వీవీఐపీని అనుసరించవచ్చునని తేటతెల్లమవుతోంది. ఇంత పెద్ద భద్రతా లోపాలపై అధికారులు ఎవరూ పెదవి విప్పక పోవడం, ఎవరిపై చర్యలు తీసుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది. భద్రతా లోపాలకు కారణాలేమిటో గుర్తించి కారకులపై తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
కళ్లు మూసుకుని పాస్‌ల జారీ
ఒక్కొక్కరికీ వేర్వేరు హోదాలో
రెండు పాసులు
ప్రధాని సమీపంలోకి
ఒకరి బదులు ఇంకొకరు
బాధ్యులపై చర్యలకు మీనమేషాలు

మోదీ పర్యటనలో భద్రత డొల్ల