
సీనరేజ్ వసూలుకు అష్ట దిగ్బంధం
● పలు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన
ప్రైవేట్ సంస్థ
● ఎగుమతి నిలిపివేసిన
నాపరాతి పరిశ్రమ యజమానులు
కొలిమిగుండ్ల: భూగర్భంలో నుంచి వెలికితీసే వివిధ రకాల ఖనిజాలకు ప్రభుత్వం సీనరేజ్ (రాయల్టీ) వసూలు చేసే బాధ్యత ప్రైవేట్ సంస్థకు అప్పగించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోటా పోటీలో వేలం దక్కించుకున్న సుధాకర ఇన్‌ఫ్రా సంస్థ కూటమి ప్రభుత్వానికి నెలకు రూ.14.05 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. నాపరాళ్లు (బ్లాక్‌స్టోన్) ఇతర ఖనిజాలను ట్రాక్టర్లు, లారీల్లో ఎగుమతి చేసేందుకు టన్నుల ప్రకారం సీనరేజ్ వసూలును ప్రవేట్ సంస్థ ప్రారంభించింది. కొలిమిగుండ్ల, అవుకు, మండలాల్లో పలు చోట్ల చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి ఒక్క వాహనం తప్పించుకోకుండా అష్ట దిగ్బంధం చేశారు. ప్రతి చెక్‌పోస్ట్ వద్ద ప్రవేట్ సిబ్బందిని 24 గంటల పాటు పర్యవేక్షణ చేసేలా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, బైక్, జీపుల్లో పెట్రోలింగ్ చేసే టీంను ప్రత్యేకంగా నియమించా రు. నాపరాళ్ల మైనింగ్‌లో వ్యర్థాలుగా మిగిలే గోడరాళ్లుకు కూడా సీనరేజ్ వసూలు చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో భూగర్భ గనుల శాఖ అధికారులు రాయల్టీ వసూలు చేసేవారు. ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడంతో ఓ సంస్థ రంగంలోకి దిగింది. గతంలో ట్రాక్టర్ రవాణా చేసేందుకు రాయల్టీకి రూ.600 మేర చెల్లించాల్సి వస్తుండేది. ప్రస్తుతం 18 శాతం జీఎస్టీతో కలిపి టన్నుకు రూ.222 వసూలు చేస్తున్నారు. ట్రాక్టర్‌కు 5 టన్నులకు రూ.1,100 రాయల్టీ చెల్లించాల్సి ఉంటుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన రాగానే అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, ఎమ్మెల్యే కాటసా ని రామిరెడ్డి, జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డిలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంతంలో మైనింగ్ పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాల గురించి వివరించారు. దీంతో యజమానులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకుంది. కానీ కూటమి ప్రభుత్వం ఏమాత్రం ఆలో చించకుండా ఇష్టారాజ్యంగా ప్రైవేట్‌కు అప్పగించడంతో యజమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిలిచిన రవాణా
నాపరాళ్ల రవాణా ట్రాక్టర్లు, లారీలతో రద్దీగా ఉండే రహదారులు బోసిపోయి కనిపిస్తున్నాయి. మూడు రోజుల నుంచి రవాణా నిలిచిపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దినసరి కూలీ పనులు చేసే కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూడు మండలాల్లో లారీ, ట్రాక్టర్లకు లోడింగ్ చేసే కార్మికులు సుమారు 1,500 మేర ఉంటారు. మూడు రోజుల నుంచి పనులు లేక పోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతుండటంతో ఆందోళన చెందుతున్నారు.
ట్రాక్టర్ యజమానుల నిరసన..
బనగానపల్లె రూరల్: కూటమి ప్రభుత్వం రాయల్టీలను ప్రవేట్ పరం చేయడంతో ట్రాక్టర్ల యజమానులు నిరసన వ్యక్తం చేశారు. బీరవోలు సమీపంలో ప్రైవేట్ సంస్థ ఏర్పాటు చేసిన రాయల్టీ చెక్‌పోస్ట్ వద్ద ట్రాక్టర్ యజమానులు నాపరాతి గనుల్లోని వేస్ట్ మెటీరియల్‌ను ట్రాక్టర్లలో తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా వేశారు. గతంలో నాపరాతి గనుల్లో వెలికితీసిన వేస్ట్ మెటిరియల్‌కు ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ చెల్లించకుండా ఉచితంగా రవాణా చేసే వారమని, ప్రస్తుతం ఈ రాయల్టీ చెల్లింపు ప్రవేట్ వారికి ప్రభుత్వం అప్పగించడంతో వారు వేస్ట్ మెటిరియల్‌కు కూడా టన్నుకు సుమారు రూ.140 ప్రకారం చెల్లించాల్సి వస్తోందన్నారు. దాదాపు రెండు గంటల సేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
బందార్లపల్లె క్రాస్ రోడ్డులో ప్రైవేటు సంస్థ ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్
రాయల్టీ కోసం ట్రాక్టర్లను నిలిపిన దృశ్యం

సీనరేజ్ వసూలుకు అష్ట దిగ్బంధం

సీనరేజ్ వసూలుకు అష్ట దిగ్బంధం