
కొలువుదీరిన శ్రీశైల దేవస్థానం ట్రస్ట్‌బోర్డు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం ట్రస్ట్‌బోర్టు నూతన కమిటీ కొలువుదీరింది. ఇటీవల శ్రీశైల దేవస్థానానికి ధర్మకర్తల సలహా మండలి కమిటీని 17 మంది సభ్యులు, ఆరుగురు ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ జీవో జారీ చేసింది. ఈ మేరకు సోమ వారం ఉదయం చంద్రావతి కల్యాణ మండపంలో ట్రస్ట్‌బోర్డు సభ్యులతో దేవస్థాన సహాయ కమిషనర్ చంద్రశేఖరరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి హాజరయ్యారు. ముందుగా పోతుగంటి రమేష్‌నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా ఏవీ రమణ, బీ రవణమ్మ, జీ లక్ష్మీశ్వరి, కే కాంతివర్దిని, ఎస్ పిచ్చయ్య, జే రేఖాగౌడ్, అనిల్‌కుమార్, దేవకి వెంకటేశ్వర్లు, బీ వెంకటసుబ్బారావు, జీ కాశీనాథ్, మురళీధర్, యు.సుబ్బలక్ష్మీ, ిపీయూ శివమ్మ, జిల్లెల శ్రీదేవి ప్రమాణస్వీకారం చేశారు. ఈ ప్రమాణస్వీకారానికి చిట్టిబోట్ల భరద్వాజశర్మ, గుల్లా గంగమ్మ హాజరుకాలేదు. అనంతరం ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన ఆరుగురిలో ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం సభ్యులు పోతుగంటి రమేష్‌నాయుడుని చైర్మన్‌గా ఎన్నుకున్నారు. చైర్మన్, సభ్యులందరికీ వేద పండితులు ఆశీర్వచనంతో పాటు, స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.