
పరిశుభ్రతతో అందరికీ ఆరోగ్యం
● జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్
నంద్యాల: పరిసరాల పరిశుభ్రతతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పేర్కొన్నారు. నంద్యాల కలెక్టరేట్ ఆవరణంలో స్వచ్ఛతహి సేవ–2025లో భాగంగా ‘ఏక్ దిన్.. ఏక్ గంట.. ఏక్ సాత్ స్వచ్ఛత’ కార్యక్రమం గురువారం నిర్వహించారు. కలెక్టరేట్ సిబ్బందితో కలిసి జేసీ విష్ణు చరణ్ చెత్తాచెదారాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇళ్ల పరిసర ప్రాంతాల్లో మురుగు నీరు నిల్వ ఉండి, చెత్త దిబ్బలు ఉంటే దోమలు వృద్ధి చెంది డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. పట్టణంలోని ముఖ్య ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలన్నారు. డీఆర్‌ఓ రాము నాయక్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నేరాల నియంత్రణకు చర్యలు
శ్రీశైలంప్రాజెక్ట్: నేరాలను నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు ఎస్పీ సునీల్ షెరాన్ తెలిపారు. శ్రీశైలం టూటౌన్ అవుట్‌పోస్టును గురువారం మధ్యాహ్నం ఎస్పీ సునీల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరుపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ.. సున్నిపెంట టూటౌన్‌లో సిబ్బంది కొరత ఉందని తన దృష్టికి వచ్చిందన్నారు. టూటౌన్ శాశ్వత భవన నిర్మాణానికి రాష్ట్ర ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతామన్నారు. ఎస్పీ వెంట ఆత్మకూరు డీఎస్పీ రామాంజినాయక్, సీఐలు చంద్రబాబు, ప్రసాదరావు ఉన్నారు.
సెలవులో వెళ్లిన జిల్లా ట్రెజరీ అధికారి
● ఏటీవో సుబ్బరాయుడుకు
పూర్తి అదనపు బాధ్యతలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్రరావు అనారోగ్య కారణాలతో ఈ నెల 19 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు సెలవులో వెళ్లారు. ఈ నేపథ్యంలో ఇదే కార్యాలయంలో అసిస్టెంట్ ట్రెజరీ అధికారి(ఏటీవోగా పనిచేస్తున్న సుబ్బరాయుడును పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా ట్రెజరీ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు బాధ్యతలు స్వీకరించిన సుబ్బరాయుడును ఏపీటీఎస్‌ఏ జిల్లా అధ్యక్షుడు డి.రవికుమార్, సెక్రటరీ గురుమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మురళీధర్‌నాయుడు, రాష్ట్ర కార్యదర్శి జడ్.కరుణాకర్ పలువురు ట్రెజరీ ఉద్యోగులు అభినందించారు.
తప్పుడు స్టాంపు డ్యూటీ సొమ్ము రూ.20.26 లక్షల రికవరీ
● అప్పటి సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్‌పై
క్రమశిక్షణా చర్యలు
కర్నూలు(సెంట్రల్): ఆస్తి విలువను తక్కువగా చూపి రూ.20.26 లక్షల స్టాంపు డ్యూటీ మినహాయింపుపై లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది క్షమించరాని నేరమని, బాధ్యతాయుత హోదాలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ అలా చేయడంతో అతనికి మూడు సంవత్సరాలపాటు ఇంక్రిమెంట్లను నిలుపుదల చేయడంతోపాటు రూ.20.26 లక్షలను బాధిత పార్టీల నుంచి ఖజానాకు జమ చేసేలా చర్యలు చేపట్టింది. 2023లో అప్పటి ఆదోని సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్ డాక్యుమెంట్ నంబర్ 5352/2023 రిజిస్ట్రేషన్‌కు తక్కువ స్టాంపు డ్యూటీ నమోదు చేసి ఖాజానాకు రూ.20.26 లక్షలు ఆర్థిక నష్టం కలిగించారని లోకాయుక్తకు ఫిర్యాదు రావడంతో ఉప లోకాయుక్త స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కర్నూలు డీఐజీని విచారణకు ఆదేశించారు. విచారణలో నేరం రుజువు కావడంతో బాధిత పార్టీల నుంచి రూ.20,26,200 వసూలు చేయడమే కాకుండా సబ్ రిజిస్ట్రార్ రాజశేఖర్‌పై క్రమశిక్షణా చర్యల కింద మూడు సంవత్సరాల పాటు ఇంక్రిమెంట్ల కోత విధిస్తూ లోకాయుక్తకు గురువారం నివేదిక సమర్పించారు. పరిశీలించిన ఉప లోకాయుక్త జస్టిస్ పి.రజనీ కేసును మూసివేశారు.

పరిశుభ్రతతో అందరికీ ఆరోగ్యం