
ఆది స్వరూపం.. దివ్య తేజం
● కూష్మాండ దుర్గ స్వరూపంలో
భక్తులకు సాక్షాత్కరించిన శ్రీశైల భ్రామరి
● కై లాసవాహనంపై
స్వామిఅమ్మవార్ల దర్శనం
● శ్రీశైలంలో వైభవంగా దసరా
నవరాత్రోత్సవాలు
శ్రీశైలంటెంపుల్: సృష్టి లేని వేళ..దశ దిశలు అంధకారంలో ఉన్నప్పుడు.. తన మందస్మితంతో ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన దివ్యస్వరూపిణి కూష్మాండదుర్గ. ఈ దేవికి గుమ్మడికాయ బలి ప్రీతికరం. ఎనిమిది చేతుల్లో ఆయుధాలు ధరించి ఉండడంతో అష్టభుజదేవిగానూ భక్తులు కొలుస్తారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నాల్గో రోజు గురువారం శ్రీశైల భ్రమరాంబాదేవి కూష్మాండదుర్గ అమ్మవారి స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ దేవి ఎనిమిది భుజాలు కలిగి ఆది స్వరూపిణిగా పేరుపొందారు. కూష్మాండదుర్గ దేవిని ఆరాధిస్తే రోగాలన్నీ తొలగి ఆయువు, యశస్సు వృద్ధి చెందుతాయని భక్తుల నమ్మకం. కూష్మాండదుర్గ అలంకారంలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికలో అధిష్టింపజేసి అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.