
అనాథ పిల్లలపై ‘వాత్సల్య’ం
● జిల్లాలో తొమ్మిది మందికి
ఆర్థిక సహాయం
నంద్యాల: కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన నిరుపేద పిల్లలకు మిషన్ వాత్సల్య స్కీం కింద గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ.. జిల్లాలో కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన తొమ్మిది మంది పిల్లలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందన్నారు. ఒక్కొక్కరికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు కలిపి మొత్తం రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. బాధిత పిల్లల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు సాధికారత కోసం మిషన్ వాత్సల్య పథకం కింద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారులను అనాథ పిల్లలు సంప్రదించాలన్నారు.
ఎంతో సంతృప్తి
కోవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన అనాఽథ పిల్లలను ఆదుకోవడంలో ఎంతో సంతృప్తి కలుగుతోందని జిల్లా కలెక్టర్ తెలిపారు. నందికొట్కూరు మండలం వడ్డేమాను గ్రామానికి చెందిన పి.రాజుకు రూ.1.50 లక్షల విలువైన వీడియో కెమెరా, గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు నిర్మించుకునేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. శ్రీశైలం మండలం సున్నిపెంట గ్రామానికి చెందిన ఎస్.సబి సుల్తానా బి.ఫార్మసీ చదువుతున్నదని వివరించగా ఆమె విద్య కొనసాగించేందుకు ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. పాణ్యం మండలం బలపనూరు గ్రామానికి చెందిన సుప్రియ, సూర్యలక్ష్మిలకు గృహ నిర్మాణ నిధులు మంజూరు చేస్తామన్నారు. ఆత్మకూరు మండలం నల్లకాల్వ గ్రామానికి చెందిన ఎస్. సౌమ్యకు డిగ్రీ పూర్తి చేసుకునేందుకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. అలాగే మహేష్, మధుసూదన్, వంశీకృష్ణ, ఓబులేసు మొత్తం 9 మంది పిల్లలను పేరుపేరునా పిలిచి వారి పరిస్థితులను జిల్లా కలెక్టర్ తెలుసుకున్నారు.