
ఇల కై లాసం.. దేవీ వైభవం
శ్రీశైలంటెంపుల్: అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇల కైలాసంలో దేవీ వైభవాన్ని కనులారా తిలకించిన భక్తజనం తన్మయత్వానికి లోనయ్యారు. దసరా నవరాత్రోత్సవాల్లో భాగంగా రెండవ రోజు మంగళవారం శ్రీశైల భ్రామరీ బ్రహ్మచారిణి స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంక్రీకృతులైన అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయం ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై ఉంచి అర్చకులు, వేదపండితులు వేదమంత్రోచ్చరణల నడుమ పూజ లు చేశారు. ప్రత్యేక అలంక్రీకృతులైన అమ్మవారి స్వరూపాన్ని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకుంటూ నీరాజనాలు సమర్పిస్తున్నారు. నవరాత్రోత్సవాల్లో భాగంగా మూడవ రోజు బుధవారం శ్రీశైల క్షేత్రంలో చంద్రఘంట అలంకారంలో అమ్మవారు, రావణ వాహనసేవపై స్వామిఅమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
మయూర వాహనంపై మల్లన్న విహారం
దసరా మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజు భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవారలు మయూర వాహనంపై విహరించి భక్తులకు ఆశీస్సులు అందించారు. బ్రహ్మచారిణి స్వరూపంలోని అమ్మవారిని, మయూర వాహనంపై అధిష్టించిన స్వామిఅమ్మవార్లను ఆలయ రాజగోపురం మీదుగా వెలుపలకి తీసుకొచ్చి గ్రామోత్సవాన్ని నిర్వహించారు. గంగాధర మండపం నుంచి నందిమండపం, అక్కడి నుంచి బయలువీరభద్రస్వామి ఆలయం వరకు గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ గ్రామోత్సవంలో కళాకారుల నృత్యాలు, డప్పు వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆయా పూజల్లో దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీని వాసరావు దంపతులు, తదితరులు పాల్గొన్నారు.
శ్రీగిరిలో దేదీప్యమానంగా
దేవీ శరన్నవరాత్రులు
బ్రహ్మచారిణి అలంకారంలో
శ్రీశైల భ్రామరీ..
మయూర వాహన సేవలో
ఆదిదంపతుల విహారం
స్వామిఅమ్మవార్లను దర్శించుకుని
పులకించిన భక్తజనం

ఇల కై లాసం.. దేవీ వైభవం

ఇల కై లాసం.. దేవీ వైభవం

ఇల కై లాసం.. దేవీ వైభవం