
ఘనంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి
కర్నూలు(అర్బన్): భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని సోమవారం స్థానిక జిల్లా పరిషత్‌లోని పీఆర్ ఎస్‌ఈ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్యాలయం ముందున్న విశ్వేశ్వరయ్య విగ్రహానికి ఇంజినీర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పీఆర్ రిటైర్డు ఎస్‌ఈ కె.సుబ్రమణ్యం, కర్నూలు, ఆదోని ఈఈలు మహేశ్వరరెడ్డి, టీసీ వెంకటేష్, డీఈఈలు బండారు శ్రీనివాసులు, రమేష్‌కుమార్‌రెడ్డి, కర్రెన్న, నాగిరెడ్డి, ధనిబాబు, భాస్కర్, రంగస్వామి, పీఆర్ ఇంజినీర్స్ అసోసియేషన్ జిల్లా గౌరవాధ్యక్షులు వి.రవీంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆర్.సతీష్‌కుమార్, డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముక్తార్‌బాషా, ఆర్‌సీ ప్రకాష్, డీఏఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోక్షగుండం మైసూర్ సంస్థానం దివానుగా ప్రజలకు చేసిన సేవలకు గుర్తుగా బ్రిటీష్ ప్రభుత్వం నైట్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఇండియన్ ఎంపైర్ బిరుదును ఇచ్చి సత్కరించారన్నారు. 1955లో భారత ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ఇచ్చి గౌరవించిందన్నారు. మైసూలోని కృష్ణరాజ సాగర్‌కు ఆయన చీఫ్ ఇంజనీరుగా పనిచేశారని గుర్తు చేశారు. అనంతరం విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తున్న డీఈఈలు రమేష్‌కుమార్‌రెడ్డి, రంగస్వామి, ఏఈఈలు ఆర్ సతీష్‌కుమార్, ఆర్ పార్థసారథి, ఏఈ మాలిక్‌లను ఘనంగా సన్మానించారు.