
పెచ్చులూడిన పాఠశాల పైకప్పు
కోసిగి: మండల పరిధిలోని కందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పైకప్పు పెచ్చులూడి పడిపోయింది. సోమవారం ఉదయం హెచ్‌ఎం ఈశ్వరయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాఠశాల గది తెరిచి చూసే సరికి తరగతి గది పెచ్చులూడి పోయింది. ఆదివారం సెలవు దినం కావడంతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పిందని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తెలిపారు. పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 615 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పాఠశాల తరగతి గదులు తడిచి పోయాయి. 7వ తరగతి గదిలో పై కప్పు సిమెంట్ పెంచులూడి తరగతి గది అంతటా చిందరబందరంగా పడి ఉంది. తరగతి గదులకు మరమ్మతులు చేయించి ప్రాణాపాయం జరుగకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరారు.