
జగనన్న సంకల్పానికి సాక్ష్యాలు
గోస్పాడు: వైఎస్సార్‌సీపీ పాలనలో రాష్ట్రంలో నిర్మించిన మెడికల్ కళాశాలలు జగనన్న సంకల్పానికి సాక్ష్యాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా అన్నారు. ఇటీవల హోమంత్రి అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ.. వాస్తవాలను ప్రజలు, కూటమి నేతలకు చూపేందుకు సోమవారం నంద్యాల ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రాగణంలో కళాశాల ఎదురుగా మీడియా సమావేశం నిర్వహించి వాస్తవాలను వివరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ హయాంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. దశల వారీగా పూర్తి చేసి రెండేళ్ల క్రితం నంద్యాల మెడికల్ కళాశాలతో సహా మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం, విజ యనగరంలో అట్టహాసంగా ప్రారంభించామన్నా రు. నంద్యాల మెడికల్ కళాశాల చంద్రబాబు అమరావతిలా గ్రాఫిక్స్ కాదు అని, హోం మంత్రి అనితకు వాస్తవాలు కనిపించవా.. అని విమర్శించారు. ఈ కళాశాలలో ఈ విద్యాసంవత్సరం 3వ సారి అడ్మిషన్ల ప్రక్రియ కూడా ప్రారంభించి పూర్తి కావస్తుందన్నారు. కళాశాల అనుమతులకు తమతో పాటు మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, నాటి జిల్లా కలెక్టర్ ఎంతో ప్రయత్నించారని గుర్తు చేశారు. టీడీపీ నాయకులు మెడికల్ కళాశాల అనుమతులు రాకుండా కోర్టుల్లో కేసులు వేశారని, అయినా అనేక సార్లు కోర్టుల వెంట తిరిగి మెడికల్ కళాశాలను సాధించామన్నారు. ఈ కళాశాలలో ప్రస్తుతం 450 మంది చదువుతున్నారన్నారు. కళాశాలకు చెందిన ప్రథమ సంవత్సరం విద్యార్థి మహేష్ ప్రతిభ చాటి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచారన్నారు. ఎన్‌ఎంసీ అనుమతులతో ప్రారంభించిన కళాశాలకు సంబంధించి ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాలను నేటికీ కూటమి ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు దారుణమన్నారు. పీపీపీ విధానం అంతా లోపభూయిష్టమని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెండింగ్‌లో ఉన్న అన్ని నిర్మాణాలను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ రాష్ట్ర మార్క్ ఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నిసా, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీపీ మధు సూధన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్‌మిల్ అమీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, సొసైటీ మాజీ చైర్మన్ రామసుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు.
నంద్యాల మెడికల్ కళాశాల
చంద్రబాబు అమరావతిలా
గ్రాఫిక్స్ కాదు
వాస్తవాలు హోంమంత్రికి కనిపించవా?
పీపీపీ విధానం అంతా లోపభూయిష్టం
మాజీ ఎమ్మెల్యే శిల్పారవి చంద్ర కిశోర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా