
నమ్మించి ముంచడమే బాబు నైజం
ప్యాపిలి: నమ్మించి రైతులను నట్టేట ముంచడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైజమని వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగాల భరత్ కుమార్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన గ్రామ పంచాయతీ సర్కిల్ నుంచి టమాట మార్కెట్‌కు రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలసి ర్యాలీగా వచ్చారు. అనంతరం స్థానిక మార్కెట్‌లో వంగాల భరత్‌కుమార్ రెడ్డి టమాట రైతుల కష్టాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో ఏదైనా పంటకు గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వమే పంటలు కొనుగోలు చేసిందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాల ఎరువులు నేరుగా రైతులకు అందించామన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. టమాట, ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతకాని తనం వల్లనే యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారని విమర్శించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట నష్టం వాటిల్లిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఆ పథకాన్నే అటకెక్కించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వ ఈ క్రాప్ బుకింగ్ కూడా చేయలేదన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి ఉల్లి, టమాట పంటలను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
రైతుల నడ్డి విరుస్తున్న వ్యాపారులు..
ఓ వైపు ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా చోద్యం చూస్తుంటే మరోవైపు ప్యాపిలి మార్కెట్‌లోని వ్యాపారులు రైతుల నడ్డి విరుస్తున్నారని ఆయన విమర్శించారు. పలువురు రైతులతో ఆయన స్వయంగా మాట్లాడి మార్కెట్‌లో జరుగుతున్న వ్యాపారుల దోపిడీ గురించి తెలుసుకుని విస్తుపోయారు. అత్యంత వ్యయప్రయాసలతో టమాట పంటను మార్కెట్‌కు తీసుకువస్తే వ్యాపారులు పది బాక్సులకు గాను ఎనిమిది బాక్సులకు మాత్రమే ధర చెల్లిస్తున్నారని తెలిపారు. డబ్బు చెల్లించే సమయంలో వంద రూపాయలకు పది రూపాయలు చొప్పున తగ్గించి ఇస్తున్నాని తెలిపారు. ఇది కాకుండా కమీషన్ అదనంగా తీసుకుంటున్నారని వాపోయారు. దీంతో పంట విక్రయించిన తర్వాత ఇంటికి ఖాళీ చేతులతో వెల్తున్నామని రైతులు తెలిపారు. రైతుల పట్ల వ్యాపారులు వ్యవహరిస్తున్న తీరును వంగాల భరత్ కుమార్ రెడ్డి తీవ్రంగా తప్పు పట్టారు. వ్యాపారుల తీరును పర్యవేక్షించి రైతులకు న్యాయం చేయాల్సిన అధికారులు మొద్దు నిద్రవీడాలని ఆయన హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు వినయ్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ప్యాపిలి, బేతంచెర్ల వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు కృష్ణమూర్తి, తిరుమలేశ్వర్ రెడ్డి, నాయకులు బోరెడ్డి పుల్లారెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, బొర్రా మల్లికార్జునరెడ్డి, గడ్డం భువనేశ్వర్ రెడ్డి, మస్తాన్ ఖాన్, బోరెడ్డి రాము, బోరెడ్డి కృష్ణారెడ్డి, పాల శ్రీను, బోరెడ్డి రఘు, విఘ్నేశ్వర్ రెడ్డి, ఎద్దుల న్న, ప్రేమసాగర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
వంగాల భరత్ కుమార్ రెడ్డి