
కార్తీక శుద్ధ ఏకాదశిన కోటి దీపోత్సవం
● శ్రీశైలం ఈఓ శ్రీనివాసరావు
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో నవంబరు 1న కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ప్రధాన ఆలయానికి ఎదురుగా గంగాధర మండపం వద్ద కోటి దీపోత్సవం నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. అక్టోబరు 22 నుంచి నవంబరు 21వ తేదీ వరకు శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు నిర్వహిస్తుండటంతో సోమవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భక్తులకు వసతి, మంచినీటి సరఫరా, సౌకర్యవంతమైన దర్శ నం, ఆలయ వేళలు, స్వామిఅమ్మవార్ల ఆర్జితసేవలు, క్యూలైన్ల నిర్వహణ, రద్దీ క్రమబద్ధీకరణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, పారిశుద్ధ్ద్యం, వాహనాల పార్కింగ్, కార్తీక సోమవారాలు, మొదటి శుక్రవారం కృష్ణమ్మకు హారతి, శుద్ధ ఏకాదశిరోజున కోటి దీపోత్సవం, లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి, కార్తీకపౌర్ణమి సందర్బంగా జ్వాలాతోరణం, పుణ్యనదీహారతి ఏర్పాట్లు, కార్తీకమాసంలో ఆకాశదీపం ఏర్పాట్లు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ మొదలైన అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్బంగా దేవస్థాన ఈఓ ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్తీకమాసంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని విభాగాలను ఆదేశించారు. ఆయా ఏర్పాట్లన్నీ అక్టోబరు 15వ తేదీ లోగా పూర్తి చేయాలని అన్ని విభాగాల అధికారులను ఆదేశించారు. ఈ మాసంలో సిబ్బందికి విధుల వేళల మార్చుతామన్నారు. కార్తీకమాసమంతా మల్లన్న గర్భాలయ అభిషేకాలు పూర్తిగా నిలుపుదల చేస్తున్నామని, కార్తీకమాస శని, ఆది, సోమవారాల్లో, పౌర్ణమి మొదలైన పర్వదినాల్లో 15 రోజుల పాటు సామూహిక అభిషేకాలు కూడా పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు వివరించారు.