
క్వింటా ఉల్లి రూ.200
● ఒక్క రైతుకూ జమకాని మద్దతు ధర ‘వ్యత్యాసం’
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా ఉల్లిగడ్డలకు లభిస్తున్న ధర రూ.200 మాత్రమే. ఈ ధరతో అమ్ముకుంటే రైతు పెట్టిన పెట్టుబడి వ్యయంలో 10 శాతం కూడా దక్కని పరిస్థితి. అయితే కూటమి ప్రభుత్వం మద్దతు ధర రూ.1200 ప్రకటించింది. వ్యాపారులు క్వింటాకు ఇస్తున్న ధర రూ.200 ఉండగా.. వ్యత్యాసం మొత్తం ప్రభుత్వం ఇస్తుందా అనే విషయమై రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల 1 నుంచి 3 వరకు మార్కెట్ యార్డుకు వచ్చిన ఉల్లిగడ్డలన్నింటినీ మద్దతు ధరతో మార్క్‌ఫెడ్ కొనుగోలు చేసింది. ఇందుకు సంబందించి ఇప్పుడిప్పుడే రైతుల ఖాతాలకు జమ అవుతున్నాయి. 6వ తేదీ నుంచి వ్యాపారులు కొనగా.. మిగిలిపోయిన ఉల్లిని మార్క్‌ఫెడ్ కొంటోంది. వ్యాపారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఒక దశలో క్వింటా రూ.100 ప్రకారం కూడా కొన్నారు. తర్వాతి నుంచి క్వింటా రూ.200 కనిష్ట ధరతో కొంటున్నారు. మద్దతు ధరలో వ్యత్యాసం ఉన్న మొత్తాన్ని ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా నేరుగా రైతుల ఖాతాలకు విడుదల చేస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి వ్యాపారులతో ప్రతి రోజు రెండు విడతలుగా ఈ–నామ్ ద్వారా కొనిపిస్తున్నారు. మద్దతు ధరలో వ్యత్యాసం ఉన్న మొత్తం ఇంతవరకు ఒక్క రైతుకూ విడుదల కాకపోవడం గమనార్హం.
నాడు గరిష్టంగా ఇచ్చిన మద్దతు
రూ.300 మాత్రమే..
2016, 2017లో నాటి టీడీపీ ప్రభుత్వం మద్దతు ధర రూ.700 ప్రకటించింది. ఈ ధర కంటే తక్కువ అమ్ముకున్న రైతులకు గరిష్టంగా రూ.300 ఇస్తామని అప్పట్లో ప్రకటించింది. అప్పట్లో రూ.300 లోపు ధరతో అమ్ముకున్న రైతులకు నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మొండిచేయి చూపారు. ఈ సారి క్వింటా రూ.100, రూ.200 ధరతో ఉల్లి అమ్ముకున్న రైతులు అనేక మంది ఉన్నారు. వీరికి బ్యాలెన్స్ అమౌంట్‌ను మార్క్‌ఫెడ్ ఇస్తుందా అనేది రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతవరకు ఒక్కరికి కూడా బ్యాలెన్స్ మొత్తం పడకపోవడం పట్ల రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మార్కెట్ యార్డుకు వచ్చిన ఉల్లి