
మంత్రి కక్ష సాధింపు చర్యలు తగవు
● శిల్పా సేవా సమితి సేవలు
అడ్డుకునే కుట్ర
● నంద్యాల మాజీ ఎమ్యెల్యే
శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి
బొమ్మలసత్రం: నియోజకవర్గంలో పేదలకు సేవలు అందిస్తున్న శిల్పా సేవా సమితిపై మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం తగదని మాజీ ఎమ్యెల్యే శిల్పా రవిచంద్రకి షోర్‌రెడ్డి విమర్శించారు. శిల్పా మహిళా బ్యాంక్ ద్వారా 138 మందికి రూ. 21.84 లక్షల రుణాలు మంజూరు కాగా బుధవారం స్థానిక శిల్పాసేవాసమితి కార్యాలయంలో ఆయన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో కొన్నేళ్లుగా శిల్పా సేవాసమితి ద్వారా శిల్పా మినరల్ వాటర్, శిల్పా సూపర్ మార్కెట్, శిల్పా మహిళా బ్యాంక్, శిల్పా స్కిల్ డెవలప్‌మెంట్‌లాంటి.. ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. ఈసేవా కార్యక్రమాలు అధికారంలో ఉన్నా.. లేకున్నా తాము కొనసాగిస్తూనే వచ్చామన్నారు. ప్రస్తుతం నంద్యాల ఎమ్యెల్యేగా గెలిచి మంత్రిగా కొనసాగుతున్న ఎన్‌ఎండీ ఫరూక్ కక్షపూరితంగా వ్యవహరిస్తూ శిల్పా సేవాసమితి చేపట్టే కార్యక్రమాలను అడ్డుకోవాలనుకోవడం తగదన్నారు. సేవా కార్యక్రమాలు జరుగుతున్న ప్రదేశాలలో అన్ని రకాల సేవలు ఖాళీ చేయించాలనే దుర్ద్దేశంతో తమపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు. ప్రథమ నందీశ్వరస్వామి దేవాలయ ఆవరణలో ఖాళీగా ఉన్న స్థలంలో పేదలకు తక్కువ ఖర్చుతో శుభకార్యాలు చేసుకునేందుకు శిల్పా సేవా సమితి ద్వారా ఫంక్షన్ హాల్ నిర్మించామన్నారు. అయితే ఇది జీర్జించుకోలేని కూటమి నేతలు కల్యాణ మండపాన్ని అడ్డుకున్నారన్నారు. సేవా కార్యక్రమాలను కూటమి నేతలు అడ్డుకుంటే తమకు ఎలాంటి నష్టం జరగదని పేద ప్రజలు నష్టపోతారన్నారు. శిల్పా మినరల్ వాటర్‌ప్లాంట్‌లు దాదాపు 40కి పైగా ఉన్నాయని వాటిని ఖాళీ చేస్తే ప్రజలకు తాగేందుకు తీవ్ర ఇబ్బంది నెలకొంటుందని వివరించారు. తమ సేవా కార్యక్రమాలను అడ్డుకునే కూటమి నేతలే సొంత ఖర్చుతో కార్యక్రమాలు కొనసాగేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ సరిలీలా తదితరులు పాల్గొన్నారు.