
ఆక్రమించిన వక్ఫ్ స్థలం పరిశీలన
బనగానపల్లె రూరల్: బనగానపల్లె ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఆక్రమించుకునేందుకు అభివృద్ధి పరచిన 4.50 ఎకరాల వక్ఫ్‌బోర్డు భూమిని అధికారులు పరిశీలించారు. ‘వక్ఫ్ భూమికి ఎసరు’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో మంగళవారం వార్త ప్రచురితం కావడంతో జిల్లా వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ ఇమ్రాన్, తహసీల్దార్ నారాయణరెడ్డి స్పందించారు. వక్ఫ్‌బోర్డు భూమిని పరిశీలించిన అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బనగానపల్లె మండలంలో ప్రభుత్వ, వక్ఫ్ ఆస్తులు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. జుర్రేరువాగు వెంట ఉన్న ఆక్రమణదారులపై చర్యలు తీసుకున్నామన్నారు. జిల్లా వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ ఇమ్రాన్ మాట్లాడుతూ.. బనగానపల్లెలో సర్వే నంబరు 132/3లో స్థలాన్ని పరిశీలించి, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశామన్నారు. రిజిస్ట్రేషన్లు కూడా నిలిపివేయాలని సంబంధిత అధికారులకు చెప్పామన్నారు. ఆక్రమణదారులు రాత్రి వేళ ఎర్రమట్టి తోలి భూమిని అభివృద్ధి చేశారన్నారు. ఇక్కడ వక్ఫ్‌భూమిలో అక్రమ రిజిస్ట్రేషన్ల జరిగింది వాస్తవమేనని చెప్పారు. వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఆక్రమించిన వక్ఫ్ స్థలం పరిశీలన