
ముస్లింలకు కూటమి వెన్నుపోటు
ర్యాలీ నిర్వహిస్తున్న మైనార్టీ నేతలు, మత పెద్దలు, జేసీ విష్ణుచరణ్‌కు వినతి పత్రం అందిస్తున్న ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మైనార్టీ నేతలు
బొమ్మలసత్రం: కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వెన్నుపోటు పొడిచిందని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా విమర్శించారు. ఇమామ్, మౌజాన్‌లకు కూటమి ప్రభుత్వం గత 11 నెలలుగా గౌరవవేతనం చెల్లించని నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ నాయకులు, ముస్లిం మత పెద్దలు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్‌కు సోమవారం వినతిపత్రం అందించారు. స్థానిక ఉదయానంద హోటల్ నుంచి ర్యాలీగా బయలుదేరి స్థానిక కలెక్టర్ కార్యాలయం వరకు చేరుకున్నారు. జేసీకి వినతి పత్రం అందించిన అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజలకు చేసిందేమి లేదన్నారు. పరమపవిత్రంగా భావించి ఇమామ్, మౌజాన్‌ల గౌరవ వేతనాలు కూడా ప్రభుత్వం ఇంత వరకూ చెల్లించిన దాఖలాలు లేవన్నారు. ఎన్నికల సమయంలో ఒక్కో మసీదుకు నిర్వాహణకు రూ. 5 వేలు ఇస్తామని, ఖబరస్తాన్, ఈద్గాలు నిర్మిస్తామని, విజయవాడలో హజ్ హౌస్‌కు స్థలం కేటాయిస్తామని.. ఇలా ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసేలేదన్నారు. షాదీఖానాకు దుల్హాన్ పథకం కింద రూ. 1 లక్ష ఇస్తామని చెప్పి మొండిచేయి చూపారన్నారు. మైనార్టీలు మిమ్మల్ని నమ్మి ఓటేసిన పాపానికి కూటమి నట్టేట ముంచిందన్నారు. ఈ మోసానికి మైనార్టీలు తప్పనిసరిగా కూటమి ప్రభుత్వానికి సరైన బుద్ధి చెబుతారని వివరించారు. గుంటూరులో ఒక మసీదుకు చెందిన 213 ఎకరాల వక్ఫ్ బోర్డు భూమిని కూటమి ప్రభుత్వం కాజేయాలని చూసిందని,. అక్కడ ముస్లింలు తిరగబడటంతో వెనక్కి తగ్గిందన్నారు. కూటమి మెడలు వంచైనా సరే ఇమామ్, మౌజాన్‌ల గౌరవవేతనాలు అందేలా పోరాడతామన్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సముచిత స్థానం ...
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముస్లిం మైనార్టీలకు పలు సంక్షేమ పథకాలతో పాటు, ఇమామ్, మౌజాన్‌లకు గౌరవ వేతనం చెల్లించి సముచిత స్థానం కల్పించారని మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నిసా అన్నారు. ప్రార్థనా మందిరాల్లో సేవలందించే మత పెద్దలకు అందించే గౌరవ వేతనంలో కూటమి ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం వహించటం బాధాకరమన్నారు. మైనార్టీలకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం తూచా తప్పకుండా నెరవేర్చాలని లేదంటే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా వైఎస్సార్‌సీపీ మైనార్టీ అధ్యక్షులు షబ్బీర్ హుస్సేన్, స్టేట్ మైనార్టీ సెక్రటరీ యూనుస్ బాషా, స్టేట్ జనరల్ సెక్రెటరీ అంజద్ అలీ, జిల్లా ఉపాధ్యక్షులు దాల్‌మిల్ అమీర్ ,జిల్లా మేధావుల సంఘం జిల్లా అధ్యక్షులు రసూల్ ఆజాద్, మాజీ రాష్ట్ర మైనార్టీ సలహాదారు హబీబుల్లా, కౌన్సిలర్‌లు ఆరిఫ్ నాయక్, కలామ్, సమ్మద్, బాసిద్, జిల్లా నాయకులు దేవనగర్ బాషా, గన్నీ కరీమ్ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

ముస్లింలకు కూటమి వెన్నుపోటు