ఉల్లి ధర మరింత పతనం | - | Sakshi
Sakshi News home page

ఉల్లి ధర మరింత పతనం

Sep 8 2025 4:46 AM | Updated on Sep 8 2025 4:46 AM

ఉల్లి ధర మరింత పతనం

ఉల్లి ధర మరింత పతనం

కర్నూలు(అగ్రికల్చర్‌): ఉల్లి ధర మరింత పతనం కావడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ నెల 5న రాత్రి కర్నూలు మార్కెట్‌కు 16,589 క్వింటాళ్ల ఉల్లి వచ్చింది. 6వ తేదీన వ్యాపారులు 7,756 క్వింటాళ్లు మాత్రమే కొన్నారు. మిగిలిన 8,842 క్వింటాళ్ల ఉల్లిని ఆదివారం వ్యాపారులు అతి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. కిలో రూపాయి చొప్పున ధర లభించడంతో రైతులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఇళ్లకు వెనుదిరిగారు. ఎకరా ఉల్లి సాగుకు రూ.లక్షకు పైగా పెట్టుబడి ఖర్చు వస్తోంది. ఎకరాకు కనిష్టంగా 30 క్వింటాళ్లు, గరిష్టంగా 80 క్వింటాళ్లు దిగుబడి వస్తోంది. క్వింటాలుకు రూ.100 ధర లభిస్తుండటంతో రైతులు ఆత్మహత్యాయత్నాలు చేసుకుంటున్నారు. వ్యాపారులు ఈ నామ్‌ ద్వారా 7,263 క్వింటాళ్లు కొన్నారు. కనిష్ట ధర రూ.100, గరిష్ట ధర రూ.619 మాత్రమే. ఉల్లిలో నాణ్యత బాగుంది. రెండు, మూడు రోజులుగా వర్షాలు లేవు. ఎండల తీవ్రత కూడా పెరిగింది. నాణ్యత బాగానే ఉన్నప్పటికీ క్వింటాలు ఉల్లికి రూ.100 ధర ఇవ్వడం కర్నూలు మార్కెట్‌ యార్డులో కలకలం రేపింది. 1,579 క్వింటాళ్ల ఉల్లిని వ్యాపారులు కొనకుండా చేతులెత్తేశారు. వ్యాపారులు కొనని ఉల్లిని మార్క్‌ఫెడ్‌ రూ.1,200 ధరతో కొనుగోలు చేసింది.

రైతు ఆత్మహత్యాయత్నాలను

బోగస్‌ అంటారా?

గతంలో ఎన్నడూ లేని విధంగా ఉల్లి ధరలు పడిపోయాయి. పెట్టుబడిలో కనీసం 20 శాతం కూడా దక్కని పరిస్థితి ఏర్పడింది. సి.బెళగల్‌ మండలం పోలకల్‌ గ్రామానికి చెందిన రైతులు వెంకటనాయుడు, కృష్ణ ఉల్లి సాగు చేసి నష్టాలు మూటగట్టుకున్నారు. అప్పుల బాధలు తట్టుకోలేక పొలంలోనే పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిని సాక్షాత్తూ ప్రభుత్వమే బోగస్‌గా పేర్కొనడంపై రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. బయట కిలో ఉల్లి రూ.20 నుంచి రూ.25 ప్రకారం విక్రయిస్తున్నారు. మార్కెట్‌ యార్డులో మాత్రం రైతులు తెచ్చిన ఉల్లి కిలో రూపాయి ప్రకారం కొంటున్నారు. ఇంత అధ్వాన్నంగా ధరలు లభిస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకోక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మూన్నాళ్ల ముచ్చట

రూ.1,200 మద్దతు ధరతో ఉల్లి కొనుగోళ్లు చేస్తామని ప్రభుత్వం చేసిన హడావుడి మూడు రోజులకే ముగిసింది. ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు మూడు రో జు లు మార్కెట్‌కు ఉల్లి గడ్డలు తక్కువగా వచ్చాయి. ఈ రోజుల్లో వచ్చిన ఉల్లి మొత్తాన్ని మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేసింది. ఈనెల 6న మార్కెట్‌కు ఉల్లిగడ్డలు పోటెత్తడ ంతో కొనుగోలులో ప్రభుత్వం చేతులెత్తేసింది. దీంతో మద్దతు కొనుగోలు మూన్నాళ్ల ముచ్చటగా మారింది.

కిలోకు లభించిన ధర

ఒక్క రూపాయి మాత్రమే!

కన్నీరు మున్నీరవుతున్న రైతులు

ఉల్లి రైతుల ఆత్మహత్యాయత్నాలను

బోగస్‌ అనడంపై నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement