
పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల పెంపు
జూపాడుబంగ్లా: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 30 వేల నుంచి 32 వేల క్యూసెక్కులకు పెంచినట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి 1,16,422 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా డ్యాంలో 883.60 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ 2, 4, 5, 6,7 గేట్ల అడుగు మేర ఎత్తి 32 వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 13 వేల క్యూసెక్కులు, ఎస్సార్బీసీ (జీఎన్‌ఎస్‌ఎస్) కాల్వకు 13 వేలు, కేసీ ఎస్కేప్ కాల్వకు 6వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు.
‘ఫారెస్ట్’ పోస్టుల భర్తీకి రేపు స్క్రీనింగ్ టెస్ట్
కర్నూలు (సెంట్రల్): ఫారెస్ట్ శాఖలోని అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ తెలిపారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఏపీపీఎస్సీ నిర్వహించే అటవీ శాఖ పరీక్షల నిర్వహణపై వివి ధ శాఖల అధికారులతో శుక్రవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆయా పరీక్షల కోసం జిల్లా లో 33 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉదయం అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పరీక్షలు 10 నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించిన పరీక్షను 3 నుంచి 5:30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఆధార్ కార్డు, లేదంటే ఏదైనా గుర్తింపు కార్డులను హాల్‌టిక్కెట్‌తో పాటు తెచ్చుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని 15 నిమిషాలకు ముందుగానే సూచించారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోరన్నారు.
632 బస్తాల ఎరువులు సీజ్
గడివేముల: మండల కేంద్రం గడివేములలో శుక్రవారం విజిలెన్స్ అధికారులు ఎరువులు దుకాణాలపై దాడులు చేసి 632 ఎరువుల బస్తాల్ సీజ్ చేశారు. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడటంతో విజిలెన్స్ సీఐ పవన్ కుమార్, డీసీటీఓ వెంకటరమణ తదితరులు మూడు దుకాణాల్లో తనిఖీలు చేశారు. ధనలక్ష్మీ ఎరువుల దుకాణంలో యూరియా బస్తా అధిక ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించి 266 బస్తాలు సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అదే విధంగా వెంకటేశ్వర ట్రేడర్స్‌లో 20.20.0.13 బస్తాలు 220, దుర్గ భవాని దుకాణీలో 146 బస్తాలు సీజ్ చేశామన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కొందరు వ్యాపారులు యూరియాను నిల్వ ఉంచి అధిక ధరలకు అమ్మే ప్రయ త్నాలు చేస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. వ్యాపారులు కృత్రిమ కొరత సష్టించి యూరియా అధిక ధరలకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.