
చెల్లని చెక్కులా మారిన ఫార్మా–డి పట్టా
కళాశాలల్లో ఆరేళ్ల పాటు ఎంబీబీఎస్‌తో సమానంగా చదివిన ఫార్మ్–డి విద్యార్థులు పట్టా చేతిలో తీసుకుని బయటకు వస్తే వారికి ఎక్కడ చూసినా చీకటే కనిపిస్తోంది. ఈ పట్టాతో ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వడం లేదు. ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా వీరి కోసం పోస్టులను సృష్టించలేదు. ప్రైవేటుకు వెళితే మీ కంటే బి.ఫార్మసి వారిని తీసుకుంటే మేలని, వారి కంటే మీది ఉన్నతమైన అర్హత అవుతుందని, మీ లాంటి వారితో పనిచేయించుకోవడం కష్టమని దెప్పి పొడిచారు..ఇంకా పొడుస్తున్నారు. 2013 తర్వాత పట్టా తీసుకుని ఇప్పటి వరకు 1400 మంది దాకా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఫార్మ్–డి నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఇటీవల రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను కలిసి తమకు న్యాయం చేయాలని విన్నవించారు.