
ఊరించి.. ఉసూరుమనిపించి!
యాళ్లూరులో క్యూలో ఉన్న రైతులు
గోస్పాడు: యాళ్లూరు గ్రామంలో రైతు సేవాకేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. శుక్రవారం మండలంలోని యాళ్లూరు గ్రామంలో అధికారుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. యాళ్లూరుకు 532 యూరియా బ్యాగ్‌లు (24 టన్నులు) మంజూరైంది. ఎకరాకు ఒక బస్తా చొప్పున మూడు బస్తాల వరకు మాత్రమే పరిమితం చేశారు. పది ఎకరాలు ఉన్నా మూడు బస్తాలే పంపిణీ చేశారు.
కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు యూరియా కష్టాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. జిల్లాకు యూరియా చేరింది.. శుక్రవారం పంపిణీ చేస్తామని అధికారుల ప్రకటనతో రైతులు ఆర్‌ఎస్‌కే, సహకార కేంద్రాల వద్ద ఉదయం నుంచి పడిగాపులు కాశారు. అయితే అరకొర కేటాయింపులతో కొన్ని చోట్ల ఒకటి, రెండు బస్తాలతో సరిపెట్టారు. పలు చోట్ల సాయంత్రం పొద్దు పోయిన తర్వాత పంపిణీ చేయాల్సి వచ్చింది. ఇంకెన్నాళ్లు యూరియా కష్టాలు అంటూ కూటమి ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు. రైతులంటే ఇంత అలుసా.. పుష్కలంగా ఎరువులు ఉన్నాయంటూనే అరకొరగా ఇస్తే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.