
రాజన్నా..నిను మరువం
బొమ్మలసత్రం: సంక్షేమ పాలనతో ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన మహానేత వైఎస్సార్ దివికేగి 16 ఏళ్లు గడిచాయి. నేటికి ఆయనను, ఆయన పాలనను స్మరించుకుంటున్నారు. మా మది నిండా నీవే రాజన్నా అంటూ అభిమానం చాటుకుంటున్నారు. మంగళవారం ఆయన వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఊరూరా ఆయన చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించి నీవే మాకు ఆదర్శమంటూ నినదించారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన మహానీయుడు వైఎస్సార్ అని ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కల్లూరులో డాక్టర్ వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. భారీ సంఖ్యలో అభిమానులు, నాయకులు తరలివచ్చి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిరస్మరణీయుడని, తండ్రి బాటలోనే తనయుడు వైఎస్ జగన్ నడుస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో కర్నూలు డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి, ఉమ్మడి జిల్లాల జోనల్ ఇన్‌చార్జ్ శ్వేతారెడ్డి, నేతలు సుదర్శన్‌రెడ్డి, భీమేశ్వరరెడ్డి, లక్ష్మీరెడ్డి , కార్పొరేటర్లు, వైఎస్సార్ అభిమానులు, నాయకులు పాల్గొన్నారు.
● నంద్యాలలో మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిషోర్‌రెడ్డి స్వగృహంలో నిర్వహించిన వై ఎస్సార్ వర్ధంతి కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు ఎమ్మెల్సీలు కల్పలతారెడ్డి, ఇసాక్‌బాషా, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నిసా, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్‌మిల్ అమీర్, ఏపీఎస్పీడీసీఎల్ మాజీ డైరెక్టర్లు మహానేత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని శ్రీనివాస సెంటర్, సాయిబాబానగర్, చామకాల్వ సర్కిల్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహాలకు భారీ పూల మాలలు వేసి జోహార్ రాజన్నా అంటూ నినదించారు. ఎమ్మెల్సీలు మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా జనరంజక పాలన అందించి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చారన్నారు. మాజీ ఎంపీ పోచాబ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ వైద్యాన్ని పేదల దరికి చేర్చిన గొప్ప నాయకుడు వైఎస్సార్ అని గుర్తు చేశారు.
● బనగానపల్లెలోని నియోజకవర్గ పరిధిలోని కొలిమిగుండ్ల మండలంలో జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. నాయకులు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బనగానపల్లెలో పార్టీ మండలాధ్యక్షుడు జనార్ధన్‌రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి మహానేత పాలనను స్మరించుకున్నారు. కోవెలకుంట్ల పట్టణంలో ఏపీఎన్‌జీవో రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు గువ్వల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌కు నివాళులర్పించారు.
● ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్డు కూడలి లోని వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్యెల్యే గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ అమలు చేసిన సంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాఘవేంద్రారెడ్డి, నాయకులు సుధాకర్‌రెడ్డి, నరసింహారెడ్డి, అభిమానులు పాల్గొన్నారు.
● నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ దారా సుధీర్ ఆధ్వర్యంలో మహానేతకు ఘన నివాళులర్పించారు. వైఎస్సార్ మరణాన్ని ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రజల హృదయాల్లో గూడుకట్టుకున్నారని చెప్పారు. కార్యక్రమంలో జెడ్‌పీటీసీ జగదీశ్వరరరెడ్డి, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ శివరామకృష్ణారెడ్డి, సర్పంచ్ జనార్ధన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
● కల్లూరు మండలం పెద్దటేకూర్‌లో వైఎస్సార్‌సీపీ నాయకుడు హనుమంతురెడ్డి ఆధ్వర ్యంలో ప్రజలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి హాజరయ్యారు.
అందరివాడు వైఎస్సార్
పాణ్యం:దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అందరివాడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం కల్లూరు మండల పరిధిలోని శరీన్‌నగర్‌లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాటమీద నిలబడే వ్యక్తిత్వం వైఎస్సార్ సొంతమన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో కొలువయ్యారన్నారు. రాయలసీమకు తలమానికమైన గోరుకల్లు జలాశయంతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. 1.92లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు గాలేరునగరి ద్వారా చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాలకు తాగునీరు అందిస్తున్న ఘనత ఆయనదేనన్నారు. రైతు భరోసాతో పాటు ఉచిత విద్యుత్‌ను అందించి అన్నదాతకు అండగా నిలిచారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెడ్‌బుక్‌తో వైఎస్సార్‌సీపీ శ్రేణులను భయపెట్టాలని చూస్తోందన్నారు. 1979లోనే ఇలాంటి బుక్‌లను ఎన్నో చూశామని, భయపడే ప్రసక్తే లేదన్నారు. అన్నింటికీ స్వస్తి పలికి ప్రజల కోసమే జీవిస్తున్నామన్నారు. పార్టీ శ్రేణులకు అన్నివిధాల అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.

రాజన్నా..నిను మరువం