
యూరియా సరఫరాలో కూటమి సర్కారు విఫలం
ఎమ్మెల్సీ కల్పలతరెడ్డి, మాజీ ఎమ్మెల్యే
ఆళ్లగడ్డ: రైతులకు యూరియా సరఫరా చేయడంలో కూటమి సర్కారు పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలతరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి ధ్వజమెత్తారు. యూరియా కొరతపై రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా మంగళవారం వారు అహోబిలం గ్రామంలో పర్యటించారు. అక్కడ రైతులు, వైఎస్సార్సీపీ శ్రేణులతో సమావేశమై మాట్లాడారు. కూటమి సర్కారుకు రైతుల సంక్షేమం పట్టదన్నారు. కనీసం పంటలకు అవసరమైన ఎరువులు కూడా అందించడం లేదన్నారు. రాష్ట్రానికి సరిపడా యూరియా ఇచ్చామని కేంద్రమంటుంటే.. రాలేదని రాష్ట్ర ప్రభుత్వం బుకాయిస్తుందన్నారు. వచ్చిన యూరియా ఎక్కడకు పోయిందో కూటమి సర్కారు చెప్పాలన్నారు. అవసరం మేరకు యూరియా అందిస్తే రైతులు రోడ్లమీదకు ఎందుకు వస్తారని సర్కారును నిలదీశారు. గత వైఎస్సార్‌సీపీ పాలనలో ఐదు సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు సరఫరా చేశామన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. పార్టీ ఆదేశాల మేరకు యూరియా కొరత, రైతాంగ సమస్యలపై ఈ నెల 6వ తేదీ నంద్యాల ఆర్డీవోను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ గజ్జల రాఘవేంద్రారెడ్డి, వైస్ ఎంపీపీ ప్రసాద్, పార్టీ మండల కన్వీనర్ కశెట్టి నాగేశ్వర్‌రావు తదితరులున్నారు
గంగుల బిజేంద్రారెడ్డి ధ్వజం