
ప్రతిభకు పురస్కారాలు
నంద్యాల: చిన్నటేకూరు అంబేడ్కర్ అకాడమీలో చదివి ఎంబీబీఎస్ సీట్లు సాధించిన ఇద్దరు జిల్లా విద్యార్థులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా రూ.లక్ష చొప్పున నగదు పురస్కారం, మెమోంటో అందజేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ నంద్యాల జిల్లా గడివేముల మండలం ఎల్‌కే తండాకు చెందిన నికేష్‌నాయక్, కొత్తపల్లి మండలం నందికుంట గ్రామానికి చెందిన ప్రణయ్‌లు చిన్నటేకూరు అంబేడ్కర్ అకాడమీలో చదువుకొని ఎంబీబీఎస్ సీట్లు సాధించడం అభినందించదగ్గ విషయమన్నారు. గ్రామీణ విద్యార్థులు మరింతగా రాణించేందుకు ఈ విజయాలు ప్రేరణ ఇస్తాయన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీదేవి, చిన్నటేకూరు అకాడమీ ప్రిన్సిపాల్ వేణుగోపాల్, అకాడమీ ఇన్‌చార్జ్ ఉమామహేశ్వరప్ప, మాజీ చైర్మన్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.