
ప్రజా సమస్యలు మాకొద్దు.. పార్టీ కార్యాలయమే ముద్దు!
● మున్సిపల్ చైర్‌పర్సన్‌తో టీడీపీ కౌన్సిలర్ల వాగ్వాదం
బొమ్మలసత్రం: ప్రజల సమస్యలకు ప్రాధాన్యం ఇచ్చి పరిష్కరించాల్సిన టీడీపీ కార్పొరేటర్లు పార్టీ కార్యాలయానికి స్థలం ఇవ్వాలని పట్టుబట్టారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌తో వాగ్వాదం దిగారు. దీంతో సమావేశం అర్ధంతరంగా ముగిసి ప్రజాసమస్యలపై ప్రస్థావన రాకుండా పోయింది. నంద్యాల పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో చైర్‌పర్సన్ మాబున్నిసా అధ్యక్షతన కౌన్సిల్‌హాల్‌లో శనివారం సమావేశం ప్రారంభమైంది. మున్సిపల్ కమిషనర్ శేషన్న 14 రకాల అంశాలతో పొందుపరిచిన ఆగస్టు నెలకు సంబంధించిన అజెండాను సభలో ప్రస్తావించారు. అందులో 11వ అంశంగా టీడీపీ కార్యాలయానికి స్థలం కేటాయింపునకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించారు.
విలువైన భూమిపై కన్ను
మున్సిపల్ కార్యాలయం దగ్గరలో మూలసాగరం సర్వే నంబర్ 415/12, 415/13 లో ఉన్న 1.57 ఎకరాల ప్రభుత్వ భూమి టీడీపీ పార్టీ కార్యాలయం కోసం కేటాయించాలని కౌన్సిల్‌లో అనుమతి కోసం ఉంచారు. ప్రస్తుతం అక్కడ సెంటు విలువ రూ.10 లక్షలకు పైగా ఉంది. అంత విలువైన భూమిని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించటంపై వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు నివ్వెరపోయారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ఇంత వరకు పేదలకు ఒక సెంటు భూమి కూడా ఎక్కడా కేటాయించలేదు. కేవలం పార్టీ కార్యాలయం కోసం అంత విలువైన భూమిని కట్టబెట్టడంపై సమావేశంలో గందరగోళం నెలకొంది.
టీడీపీ కౌన్సిలర్ల గగ్గోలు
వర్షాలు కురవడంతో కొన్ని రోజులుగా నంద్యాల పట్టణంలో కాలనీలన్నీ నీటి కుంటలుగా తయారయ్యాయి. ఎక్కడ చూసినా చెత్త పేరుకుపోయి దోమలు విస్తరించుకుపోయాయి. దోమల కారణంగా ప్రజలు ప్రాణాంతక వ్యాధులు బారినపడి అల్లాడిపోతున్నారు. దీనిపై చర్చ జరపకుండా తమ పార్టీ కార్యాలయం కోసం భూమి కేటాయింపు విషయంపై టీడీపీ కౌన్సిలర్లు గగ్గోలు పెట్టడం ఆశ్చర్యానికి గురిచేసింది. చైర్‌పర్సన్ మాబున్నిసా కూర్చున్న పోడియం వద్దకు టీడీపీ కౌన్సిలర్లు వెళ్లి భూమి కేటాయింపు ప్రతిపాదనకు అనుమతి ఇవ్వాల్సిందేనంటూ కేకలు వేశారు. మాబున్నిసా ఎంత నచ్చజెప్పినా టీడీపీ కౌన్సిలర్లు వినలేదు. స్థలం కేటాయింపునకు అధిక సంఖ్యలో సభ్యులు నిరాకరించటంతో ఆ ఒక్క అంశాన్ని పెండింగ్‌లో ఉంచారు. కౌన్సిల్ సభ్యుల గందగోళం మధ్య అర్ధాంతరంగా సభను ముగించి ఆమె వెళ్తుండగా టీడీపీ కౌన్సిలర్లు చుట్టుముట్టారు. సభను కొనసాగించి తమకు అనుకూలంగా స్థలం కేటాయింపు చర్చను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై సభను జరపకుండా అనవసరమైన విషయలపై సభ్యులు పట్టుబడుతుండగా ఆమె సమావేశ భవనం నుంచి వెళ్లిపోయారు.
వర్షాల కారణంగా దోమలతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇవే కాకుండా పట్టణంలో వికలాంగుల పింఛన్‌లు నిలిచిపోయి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగతున్నారు. ప్రజా సమస్యలను సమావేశంలో వివరించాలని వస్తే టీడీపీ కౌన్సిలర్లు సభను అడ్డుకున్నారు. అలాంటి సమస్యలపై చర్చలు జరపకుండా కేవలం పార్టీ కార్యాలయం స్థలం కోసం సమావేశాన్ని అడ్డుకోవటం దారుణం. –దేశం సులోచన (18వ వార్డు కౌన్సిలర్)
మున్సిపల్ అధికారుల అత్యుత్సాహం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పట్టణానికి దూరంగా ప్రజా జీవనానికి అనుకూలంగా లేని ప్రాంతంలో పార్టీ కార్యాలయనిర్మాయానికి ఒక ఎకరా భూమిని కేటాయించేందుకు 2023 మేనెలలో కౌన్సిల్ తీర్మానం చేసింది. కార్యాలయ నిర్మాణానికి నిధులు సమకూర్చుకునేందుకు కొంత జాప్యం జరిగింది. తర్వాత ఎన్నికలు రావటం, టీడీపీ అధికారం చేపట్టింది. ఈనేపథ్యంలోనే టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయానికి కేటాయించిన భూమిలో మున్సిపల్ అధికారులు అనుమతులు ఇవ్వకుండా ఒత్తిడి చేశారు. కార్యాలయ నిర్మాణానికి అధికారులు అడ్డుచెప్పడంతో పనులను అర్ధంతరంగా నిలిపివేశారు. ఇప్పుడు తిరిగి మున్సిపల్ అధికారులు టీడీపీ కార్యాలయం కోసం ప్రజా జీవనానికి అనువుగా ఉండే ప్రాంతంలో 1.57 ఎకరాల ప్రభుత్వ భూమి అనుమతి కోసం అజెండాలో చేర్చటం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్సీపీ కార్యాలయ స్థలానికి వీఎల్‌టీని కూడా అనుమతించని అధికారుల టీడీపీ కార్యాలయానికి విలువైన భూమి కేటాయింపుపై సభలో చర్చకు తీసుకురావటంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

ప్రజా సమస్యలు మాకొద్దు.. పార్టీ కార్యాలయమే ముద్దు!