
దరఖాస్తుల ఆహ్వానం
నంద్యాల(అర్బన్): నంద్యాల ఐసీడీఎస్ అర్బన్ ప్రాజెక్టు పరిధిలో నాలుగు అంగన్‌వాడీ ఆయా పోస్టుల నియామకానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సీడీపీఓ చంద్రకళ గురువారం తెలిపారు. మంచాలకట్ట–1 అంగన్‌వాడీ కేంద్రం ఓసీ (జనరల్), అయ్యలూరు–2 (ఈడబ్ల్యూఎస్), మాల్దారిపేట–2 ఎస్సీ (గ్రూప్ థర్డ్), పి.కొట్టాల–2 అంగన్‌వాడీ కేంద్రం బీసీబీ రిజర్వేషన్ల ప్రకారం 18 నుంచి 35 ఏళ్లలోపు మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈనెల 31వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు కార్యాలయ పనిదినాల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు.
ఎన్‌ఎంఎంఎస్‌కు పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి
నంద్యాల(న్యూటౌన్): నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షలో ఎంపికైన విద్యార్థులు ఆగస్టు 31వ తేదీ లోపు www.scholr ships. gov.inలో నమోదు చేసుకోవాలని డీఈఓ జనార్దన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తప్పులు లేకుండా మెరిట్ లిస్ట్, ఆధార్‌లో ఉండే విధంగా సరి చూసుకొని పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఆధార్ కార్డు లేని విద్యార్థులు ఆధార్, బ్యాంక్ పాసు పుస్తకాలలో సరి చేయించుకోవాలన్నారు. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు ఒక అక్షరం తేడా ఉన్నా ప్రొఫార్మాతో కూడిన దరఖాస్తును జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఇవ్వాలన్నారు. ఈ సంవత్సరం 10, 11, 12 తరగతులు ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాలయాల్లో సాధారణ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తప్పకుండా రెన్యువల్ చేసుకోవాలన్నారు. గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయని విద్యార్థులకు స్కాలర్‌షిప్ మంజూరు కాదన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత పా ఠశాల వారే బాధ్యత వహించాలని డీఈఓ తెలిపారు.
గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలి
నందికొట్కూరు: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా పరిషత్ సీఈఓ నాసరరెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని శాతనకోట, అల్లూరు గ్రామాల్లో శానిటేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల కాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేయాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రమణ్యం శర్మ, పీఎస్‌లు, తదితరులు పాల్గొన్నారు.