సబ్సిడీలకు తిలోదకాలు | - | Sakshi
Sakshi News home page

సబ్సిడీలకు తిలోదకాలు

Jul 26 2025 9:56 AM | Updated on Jul 26 2025 10:28 AM

సబ్సిడీలకు తిలోదకాలు

సబ్సిడీలకు తిలోదకాలు

కర్నూలు(అగ్రికల్చర్‌): అగ్గిపెట్టెలో పట్టే విధంగా పట్టు చీరలు నేసిన ప్రాంతం ఉమ్మడి కర్నూలు జిల్లా. అయితే పట్టు పరిశ్రమకు, మల్బరీ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం లేదు. పెట్టుబడి వ్యయం రెట్టింపు అవుతున్నా రైతులకు సబ్సిడీలు అందడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పట్టుగూళ్ల మార్కెటింగ్‌ సదుపాయం లేదు. నష్టాలు ఎక్కువగా ఉండటంతో రైతులు మల్బరీ సాగుకు దూరమవుతున్నారు. గతేడాది (2024–25లో) మల్బరీ సాగు తగ్గిపోగా.. ఈ ఏడాది మరింత అధ్వాన స్థితికి చేరింది.

అరకొరగా మల్బరీ సాగు

2025–26లో కర్నూలు జిల్లాలో 150, నంద్యాల జిల్లాలో 200 ప్రకారం ఉమ్మడి జిల్లాలో 350 ఎకరాల్లో మల్బరీ సాగు చేపట్టాలనేది లక్ష్యం. ఖరీఫ్‌ సీజన్‌ మొదలై దాదాపు 50 రోజులవుతున్నా మల్బరీ సాగులో పురోగతి కనిపించడం లేదు. కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు 18 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 4 ఎకరాల్లో మాత్రమే మల్బరీ ప్లాంటేషన్‌ జరిగినట్లు తెలుస్తోంది. 2024–25లో ఉమ్మడి జిల్లాలో 350 ఎకరాల్లో మల్బరీ ప్లాంటేషన్‌ చేపట్టాలనేది లక్ష్యం. అయితే 200 ఎకరాల్లో మాత్రమే జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి మరింత తగ్గే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికీ మల్బరీ సాగుపై ఆసక్తి ఉన్న రైతులను గుర్తించడానికి చర్యలు తీసుకోలేదు. రాయితీలు తగ్గించడంతో రైతులు పట్టు సాగుపై నిర్లిప్తతతో ఉన్నట్లు తెలుస్తోంది.

‘ఉపాధి’ తొలగింపు

మల్బరీ సాగు చేసే రైతులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ప్రత్యేక రాయితీలు లభించేవి. షెడ్ల నిర్మాణానికి ‘ఉపాధి’ నిధుల నుంచి సబ్సిడీలు ఆశాజనకంగా ఉండేవి. ఒక షెడ్‌కు రూ.3.50 లక్షల వరకు సబ్సిడీ ఇచ్చేవారు. 2024–25 నుంచి షెడ్ల నిర్మాణానికి ‘ఉపాధి’ నుంచి రాయితీలు లేవు. కేవలం ప్లాంటేషన్‌లో మాత్రం అరకొర సబ్సిడీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఒక్క రైతుకు కూడా ‘ఉపాధి’ నుంచి ప్లాంటేషన్‌కు రాయితీలు ఇవ్వలేదు.

ప్రోత్సాహం కరువై!

ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతంలో 1,500 టన్నుల బైవోల్టెన్‌ పట్టుగూళ్ల ఉత్పత్తి జరిగేది. 2024–25లో కేవలం 500 టన్నులకు పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో మార్కెటింగ్‌ సదుపాయం లేకపోవడంతో ఉత్పత్తి చేసిన పట్టుగూళ్లను హిందూపురం మార్కెట్‌కు తరలించాల్సి వస్తోంది. మార్కెట్‌లో పట్టుగూళ్లకు లభించిన ధరకు అదనంగా కిలోకు రూ.50 రాష్ట్ర ప్రభుత్వం ఇంటెన్సివ్‌ పేరుతో ప్రత్యేక ప్రోత్సాహం ఇచ్చేది. కూటమి ప్రభుత్వం ఇంటెన్సివ్‌ ఇవ్వడం లేదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2023–24 వరకు మల్బరీ సాగును ప్రోత్సహించాయి. కేంద్ర ప్రభుత్వం యథాతథంగా రాయితీలు ఇస్తుండగా 2024–25 నుంచి కూటమి ప్రభుత్వం సబ్సిడీలకు తిలోదకాలు ఇచ్చింది.

పట్టుపురుగుల పెంపకం కోసం రైతులు విధిగా షెడ్డు నిర్మించుకోవాల్సి ఉంది. షెడ్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.25 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1,12,500 సబ్సిడీ ఇస్తాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా కింద రూ.1,12,500 సబ్సిడీ ఇవ్వడం లేదు. దీన్ని కూడా రైతు భరించాల్సి వస్తోంది.

మల్బరీ మొక్కలు నాటుకోవడంలో (ప్లాంటేషన్‌) ఎకరాకు యూనిట్‌ కాస్ట్‌ రూ.30 వేలు ఉంది. ఇందులో కేంద్రం ప్రభుత్వం రూ.15,000, రాష్ట్ర ప్రభుత్వం రూ.7,500 ఇవ్వాల్సి ఉంది. రైతు రూ.7,500 భరించాల్సి ఉంది. అయితే మొక్కలు నాటుకున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం లేదు.

పరికరాలకు యూనిట్‌ కాస్ట్‌ రూ.75 వేలు ఉండగా..రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా రాయితీలకు ఎగనామం పెట్టింది.

మల్బరీ సాగు చేసే రైతులకు బ్రష్‌ కట్టర్‌, పవర్‌ స్ప్రేయర్లు, సికేచర్‌ వంటివి కూడా రాయితీపై రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అయితే వీటిని కూడా ఇవ్వడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement