
జిల్లాలో మోస్తరు వర్షం
నంద్యాల(అర్బన్): జిల్లాలో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. శ్రీశైలంలో అత్యధికంగా 35.4మి.మీ, గోస్పాడులో అత్యల్పంగా 1.0మి.మీ వర్షం కురిసింది. అదే విధంగా ఆత్మకూరులో 15.8, కొత్తపల్లె 10.4, ప్యాపిలి 9.8, మహానంది 8.2, వెలుగోడు 8.0, కొలిమిగుండ్ల 7.6, గడివేముల 6.8, చాగలమర్రి 5.2, పాములపాడు 4.2, పగిడ్యాల 3.8, మిడుతూరు 3.4, నంద్యాల అర్బన్, బండిఆత్మకూరు 3.2, నందికొట్కూరు 2.6, అవుకు 2.4, బనగానపల్లె 2.2, రుద్రవరం 1.4, నంద్యాల రూరల్, జూపాడుబంగ్లా, ఆళ్లగడ్డ, ఉయ్యాలవాడ 1.2 మి.మీ వర్షం కురిసింది.
వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు
శ్రీశైల టెంపుల్: వర్షాల వలన వచ్చే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాసరావు అధికారులను ఆదేశించారు. మంగళవారం దేవస్థాన పరిపాలన భవనంలోని సమీక్షా సమావేశ మందిరంలో దేవస్థాన అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఈఓ మాట్లాడుతూ.. క్షేత్ర పరిధిలో ఎక్కడ కూడా చెత్తాచెదారాలు ఉండకుండా విస్తృతంగా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఆదేశించారు. ఎక్కడా వర్షం నీరు నిల్వ ఉండకుండా ఉండేలా, దోమలు వృద్ధి చెందకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. దేవస్థానం వైద్యశాలలో అవసరమైన అన్నీ మందులను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. సమావేశంలో డిప్యూటీ కార్యనిర్వహణాధికారి ఆర్.రమణమ్మ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నరసింహారెడ్డి, ఏఈవోలు, పర్యవేక్షకులు, సిబ్బంది, అపోలో వైద్యులు పవన్‌కుమార్‌రెడ్డి, అనురాగ్‌రెడ్డి, పీహెచ్‌సీ వైద్యులు శ్రీవాణి, ఆముర్వేద వైద్యులు స్వరూప తదితరులు పాల్గొన్నారు.
దాడి చేసింది పులినా.. చిరుతా?
ఆత్మకూరురూరల్: కొత్తపల్లె మండలం చదరం పెంట చెంచు గూడెం పొలాల సమీపంలో సోమవారం చెంచు రైతు అంకన్నపై దాడి చేసిన వన్యమృగం పెద్ద పులినా.. చిరుతనా అనే అనుమానం వ్యక్తమవుతోంది. సమాచారం అందుకున్న అటవీ అధికారులు మంగళవారం సంఘటన ప్రాంతానికి చేరుకుని వన్య మృగం సంచారంపై ఆరా తీశారు. అయితే ఆ ప్రాంతంలో గడ్డి ఏపుగా పెరగడం, వర్షం కురవడంతో పాద ముద్రలు గుర్తించడం కష్టంగా మారింది. అంకన్నపై పెద్దపులి దాడి చేస్తే పంజా వేటుకు శరీర భాగంలో కండ మొత్తం ఊడి కింద పడే అవకాశం ఉండేది. అతని శరీరంపై గోకుడు గాయాలు, చిన్నపాటి గీతలు మాత్రమే కనిపించడం వారి అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. అంకన్న చేయికి తగిలిన గాయాలను బట్టి చిరుతా లేదా అడవి పంది ఉండవచ్చునేమోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. అయితే ఆ యువకుడిపై దాడి చేసింది ఏదో ఒక అడవి జంతువే కాబట్టి, అటవీ చట్టం ప్రకారం తగిన పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించండి
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి పి.రామంజనేయులు కంపెనీల ప్రతినిధులకు సూచించారు. 2025–26లో 550 హెక్టార్లలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలనేది లక్ష్యమని, ఇప్పటి వరకు 86 హెక్టార్లలో ప్లాంటేషన్ పూర్తయిందన్నారు. కలెక్టరేట్‌లోని జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయంలో మంగళవారం ఆయన ఆయిల్‌పామ్ కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 13 మండలాల్లో ఆయిల్‌పామ్ సాగుకు అవకాశం ఉందని, సెప్టెంబర్ 15 వరకు మెగా ప్లాంటేషన్ డ్రైవ్ కొనసాగుతుందని, ఆలోపు కనీస లక్ష్యంలో 50 శాతం ప్లాంటేషన్ పూర్తి కావాలన్నారు. హెక్టారుకు ప్లాంటేషన్‌కు రూ.29 వేలు, నిర్వహణకు రూ.5250, అంతరపంటల సాగుకు రూ.5250 సబ్సిడీ వస్తుందన్నారు. సమావేశంలో సాంకేతిక ఉద్యాన అధికారి అనూష తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో మోస్తరు వర్షం

జిల్లాలో మోస్తరు వర్షం