పేదల సంక్షేమం విషయంలో కూటమి ప్రభుత్వం మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు మాత్రం పల్లెల్లో పింఛన్లు కూడా అర్హులందరికీ ఇవ్వలేని స్థితిలో ఉంది. ప్రభుత్వం అలసత్వం.. అధికారుల నిర్లక్ష్యంతో ఎంతో మంది అభాగ్యులకు పింఛన్ అందడం లేదు. వారిలో 80 ఏళ్ల వయస్సు పైబడిన ఈ వృద్ధురాలు ఒకరు. కుటుంబీకులందరినీ కోల్పోయి అనాథగా మిగిలింది. నిలువ నీడ లేక ఖాళీ స్థలంలో తాటాకులతో ఇరుగు పొరుగు వారు దయతలచి నిర్మించి ఇచ్చిన గుడిసెలో ప్రస్తుతం తల దాచుకుంటోంది. పూట గడిచేందుకు భిక్షాటన చేస్తోంది. మండల కేంద్రమైన చాగలమర్రిలోని ఎస్టీ కాలనీకి చెందిన గాజుల చిన్న గంగమ్మకు అదే కాలనీకి చెందిన సుంకన్నతో వివాహమైంది. వీరికి సంతానం లేక పోవడం, అనారోగ్యంతో భర్త మరణించడంతో ఆమె సంజామల మండలం ఆకుమల్ల గ్రామంలో నివాసం ఉంటున్న సోదరి గంగమ్మ ఇంటిలో తలదాచుకుంది. ఆ సమయంలో ఒకే ఇంటిలో ఉన్న గంగమ్మకు పింఛన్ మంజూరు కావడంతో చిన్న గంగమ్మకు ఇవ్వలేదు. అయితే కొన్ని సంవత్సరాల క్రితం గంగమ్మ మృతి చెందడంతో చిన్న గంగమ్మ తిరిగి చాగలమర్రి గ్రామానికి వచ్చి కాలనీలో బంధువుల ఇళ్ల వద్ద తల దాచుకుంటుంది. ఈ మేరకు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు ఉన్నా ఆమె సోదరికి గతంలో గంగమ్మకు పింఛన్ వస్తుందని ఇప్పటికీ అనాథ వృద్ధురాలికి పింఛన్ మంజూరు చేయలేదు. పలుమార్లు సచివాలయం, ఎంపీడీఓ కార్యాలయం చూట్టూ తిరిగినా ఆమె సమస్యను ఆలకించి పరిష్కరించిన అధికారి లేరు. పూట గడవక చివరకు భిక్షాటన చేస్తూ కాలం గడుపుతోంది. ఇప్పటికై న చిన్న గంగమ్మకు వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేసి జిల్లా కలెక్టరు ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. – చాగలమర్రి