
కూటమి ప్రభుత్వంలో మాకు విలువ ఎక్కడిది?
కర్నూలు(అర్బన్): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మండలాల్లో తమకు ఎలాంటి విలువ లేకుండా పోయిందని జెడ్పీటీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం కూటమి నేతలు చెప్పిందే వేదంగా మండల స్థాయి అధికారులు విధులు నిర్వహిస్తున్నార ని వాపోతున్నారు. తమకు విలువ లేని సమయంలో ప్రభుత్వం ఇస్తున్న శిక్షణ తీసుకున్నా, ఉపయోగం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. అందుకే శిక్షణకు హాజరు కాలేకపోతున్నామని చెబుతున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు స్థానిక జిల్లా పరిషత్‌లోని డీపీఆర్‌సీ భవనంలో ‘మార్పు ద్వారా విజేతలు – సాధికారతతో సుపరిపాలన సాధ్యం’ అనే అంశంపై ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహిళా జెడ్పీటీసీలకు శిక్షణా తరగతులను ప్రారంభించారు. మొదటి రోజైన మంగళవారం ఉదయం ప్రారంభమైన ఈ శిక్షణా తరగతులకు జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డితో ముగ్గురు మహిళా జెడ్పీటీసీలు (పగిడ్యాల నుంచి పి దివ్య, కృష్ణగిరి నుంచి కేఈ సుభాషిణి, నందికొట్కూరు నుంచి షేక్ కలీమున్సీసా) మాత్రమే హాజరయ్యారు. జెడ్పీ చైర్మన్‌తో కలిపి మొత్తం 53 మంది జెడ్పీటీసీలు ఉండగా, ఇందులో 27 మంది మహిళలు ఉన్నారు. వీరిలో తొలి రోజు శిక్షణకు కేవలం ముగ్గురు మాత్రమే హాజరయ్యారు. ప్రభుత్వ నిబంధనల మేరకు తప్పనిసరి పరిస్థితుల్లో శిక్షణను కొనసాగించాల్సి ఉన్నందున .. జ్యోతి ప్రజ్వలన చేసి డా.బీఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ చిత్ర పటాలకు పూలమాలలు వేసి శిక్షణను ‘మమ’ అనిపించారు. హాజరైన ముగ్గురు జెడ్పీటీసీలకు జెడ్పీ సీఈఓ జీ నాసరరెడ్డి, డీపీఆర్‌సీ కోఆర్డినేటర్ మంజులావాణి, రిసోర్స్ పర్సన్స్ కే రవికిశోర్, జీ నగేష్, టీ రాముడు పలు విషయాలపై కొద్ది సేపు అవగాహన కల్పించి శిక్షణా తరగతులను ముగించారు.
మూడు రోజులు శిక్షణ తీసుకున్నా ఫలితం శూన్యం
మహిళా జెడ్పీటీసీల ఆందోళన
27 మంది మహిళా జెడ్పీటీసీలలో ముగ్గురే హాజరు
అందని గౌరవ వేతనాలపైనా పెదవి విరుపు ...
నిధులు లేకపోవడం, విధుల నిర్వహణలో అడ్డంకులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీటీసీలకు ఇచ్చే గౌరవ వేతనాలను కూడా పెండింగ్‌లో పెట్టడం వల్ల కూడా జెడ్పీటీసీలు శిక్షణా తరగతులకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనట్లు తెలుస్తోంది. 2024 జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 19 నెలలుగా జెడ్పీటీసీలకు గౌరవ వేతనాలను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఒక్కో జెడ్పీటీసీకి నెలకు రూ.6 వేల ప్రకారం 19 నెలలకు రూ.1.14 లక్షలను ప్రభుత్వం బకాయి పడింది. ఈ నేపథ్యంలోనే జెడ్పీ చైర్మన్‌ను మినహాయించి మిగిలిన 52 మంది జెడ్పీటీసీలకు ఈ నెలతో కలిసి రూ.59.28 లక్షలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అలాగే మరో ఏడాది మాత్రమే పదవీ కాలం ఉన్నందున ఇప్పుడు శిక్షణ తీసుకొని ఉపయోగమేంటనే భావనను కూడా పలువురు జెడ్పీటీసీలు వ్యక్తం చేస్తున్నారు.