
రాష్ట్రంలో అరాచక పాలన
● అక్రమ కేసులతో భయపెట్టలేరు
● పోలీసుల ఏకపక్ష తీరు సరికాదు
● నాడు పరిశ్రమలను అడ్డుకున్న
బీసీకి నేడు కాంట్రాక్ట్‌లు
కొలిమిగుండ్ల: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి విమర్శించారు. శనివారం సాయంత్రం కొలిమిగుండ్లలోని పార్టీ కార్యాలయం ఆవరణలో జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డితో కలిసి ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’పై విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాటసాని మాట్లాడుతూ.. కూటమి పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయన్నారు. పోలీసులు అధిపార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని, పోలీస్ స్టేషన్‌కు ఎవరైనా ప్రజలు వెళితే ఏ పార్టీ అని అడగటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇలాంటి సంస్కృతి గతంలో ఎన్నడూ లేదన్నారు. టీడీపీ నాయకులు గనులు, ఖాళీ స్థలాలు కనిపిస్తే కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రామ్‌కో, అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు సహకరించామన్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ప్రోత్సహించిందన్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ యాజమానులు విరుద్ధంగా టీడీపీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. గతంలో పెట్నికోట అల్ట్రాటెక్ ఫ్యాక్టరీ ప్రజాభిప్రాయ సేకరణ సభలో ప్రస్తుత మంత్రి బీసీ జనార్దనరెడ్డి ఫ్యాక్టరీకి వ్యతిరేకం, పొల్యూషన్ వస్తుందని చెప్పారని, నేడు ఆయనకే కంపెనీలు కాంట్రాక్ట్‌లు అప్పగించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన వారిని బాగా గుర్తు పెట్టుకోవాలని, ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. టీడీపీ నాయకులు సుపరిపాలన పేరుతో చీకటి పడ్డాక గ్రామాలకు తూతూ మంత్రంగా వెళ్లి వస్తున్నారని విమర్శించారు. గతంలో గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రతి పల్లెలో తాము జగనన్న సంక్షేమ పథకాల గురించి వివరించామని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలోని హామీల అమలులో ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు.
మంత్రికి చౌకబారు మాటలు తగవు
మంత్రి స్థానంలో ఉన్న బీసీ జనార్దనరెడ్డి స్థాయికి తగ్గట్లుగా మాట్లాడకుండా చౌకబారుగా మాట్లాడం తగదని జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి హితువు పలికారు. ఇటీవల కొలిమిగుండ్లకు వచ్చిన సమయంలో మంత్రి తమ కుటుంబాన్ని విమర్శించడం తగదన్నారు. ఏనాడు వ్యక్తిగతంగా తాను ఎవరినీ విమర్శించ లేదన్నారు. బీసీ కుటుంబం గురించి మాట్లాడాలంటే ఏడాది సమయమైనా సరిపోదన్నారు. కొలిమిగుండ్లలో గ్రామ పంచాయితీ సర్పంచ్ వేసే రోడ్డును ప్రారంభించి ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లు మంత్రి బీసీ వ్యవహరించారన్నా రు. అస్తవ్యస్తంగా ఉన్న ప్రధాన రహదారి స్థానంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 200 మీటర్ల పొడవున విశాలమైన సీసీ రోడ్డు నిర్మించామని గుర్తు చేశారు. సెంట్రల్ లైటింగ్, ఆర్టీసీ ప్రాంగణంలో వేసిన సీసీ రోడ్డు కనిపించ లేదా అని మంత్రిని ప్రశ్నించారు. పది మీటర్ల ప్యాచింగ్ వేసి ఏదో గొప్ప ఘనకార్యం చేసినట్లు చెప్పుకోవడం మంత్రిగా సిగ్గుచేటన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒక్క కొలిమిగుండ్లలోనే భవనాల నిర్మాణాల రూపంలో రూ.20 కోట్ల మేర అభివృద్ధి పనులు చేశామని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు లాయర్ మహేశ్వరరెడ్డి, నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు పేరం నందకిషోర్‌రెడ్డి, జిల్లా గ్రీవెన్ సెల్ అధ్యక్షుడు బాచం మహేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ రామాంజనేయులు, వైస్ ఎంపీపీ కృష్ణారెడ్డి, నాయకులు పేరం సత్యనారాయణరెడ్డి, అంబటి చంద్రమోహన్‌రెడ్డి, సత్తిగారి రామిరెడ్డి, మూల ఈశ్వరరెడ్డి, మొలక రాజారెడ్డి, మనోహర్‌రెడ్డి, గుర్విరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.