
తడవని పొలాలు.. తొలగని రైతుల కష్టాలు
గోరుకల్లు రిజర్వాయర్ మట్టి ఆనకట్ట రాతి పరుపు కుంగిపోతుంది. దీని పూర్తి సామర్థ్యం 12.4 టీఎంసీలు. కట్టను 265.6 మీటర్ల ఎత్తుతో నిర్మించాలి. ఇప్పటి వరకూ 262 మీటర్లు ఎత్తు నిర్మించారు. గత ప్రభుత్వం 11.2 టీఎంసీల నీరు నిల్వ చేసింది. రిజర్వాయర్ భద్రత, పూర్తి స్థాయి సామర్థ్యం నీటి నిల్వకు అయ్యే పనుల కోసం రూ.99.22కోట్లతో గత ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను ప్రస్తుతం పక్కన పెట్టేశారు. రిజర్వాయర్‌ను కూటమి ప్రభుత్వం ఏడాదిగా పట్టించుకోకపోవడంతో మట్టి కట్ట రాతి పరుపు కుంగిపోయింది. పనులకు రూ.58.6 కోట్లతో చేసిన ప్రతిపాదనలు చేసినా స్పందన లేదు. నంద్యాల కలెక్టర్ రాజకుమారి డీఎంఎఫ్ నుంచి రూ.2.50 కోట్లతో తాత్కలికంగా చేపట్టిన పనులు సైతం పూర్తి కాలేదు.
ఆయకట్టుకు సాగు నీరు అందేనా?
నంద్యాల జిల్లాలో తెలుగుగంగ, శ్రీశైలం కుడి కాలువ, కేసీ కెనాల్, సిద్ధాపురం ఎత్తిపోతల పథకం, వరదరాజుల శివ భాష్యం ప్రాజెక్టు, చిన్న నీటిపారుదల శాఖ చెరువుల కింద 5 లక్షలకుపైగా ఆయకట్టు ఉంది. ఇందులో చెరువులు మినహా మిగిలిన ప్రాజెక్టులకు కృష్ణా జలాలే ఆధారం. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆయకట్టుకు పూర్థి స్థాయిలో నీరు అందే పరిస్థితులు కనిపించడం లేదు.
● ఎస్‌ఆర్‌బీసీకి విడుదల కాని నీరు
● నిలిచిపోయిన అవుకు
మూడో టన్నెల్ పనులు
● రాజోలి, జొళదరాశి ఊసే ఎత్తని
రాష్ట్ర ప్రభుత్వం
● ‘గోరుకల్లు’కు
శాశ్వత మరమ్మతులు లేనట్టే!
● ఏడాదిగా నిలిచిపోయిన
రాయలసీమ లిఫ్ట్ పనులు
● అటకెక్కిన ‘అలగనూరు’
● నేడు నంద్యాల జిల్లా ఐఏబీ సమావేశం
కర్నూలు సిటీ: రాయలసీమ ప్రాంతంపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించలేదు. దీంతో పంట పొలాలన్నీ ఎండిపోయి కనిపిస్తున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాకపోతే త్వరలో రాయలసీమ ఎడారి ప్రాంతంగా మారే అవకాశం ఉందని మేధావులు విమర్శిస్తున్నారు. ఇందుకు వర్షాభావ పరిస్థితులు దోహదం చేస్తాయని చెబుతున్నారు. సాగు నీటి కాలువలకు నీటి విడుదలపై చర్చించేందుకు నేడు(శనివారం) మధ్యాహ్నం నంద్యాలలో సాగునీటి సలహా మండలి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి నంద్యాల జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, వైఎస్సార్ జిల్లాకు చెందిన నేతలు సైతం హాజరుకానున్నారు.
స్పందించని రాష్ట్ర ప్రభుత్వం
రాయలసీమ జిల్లాల్లో వర్షాలు ఆశించిన స్థాయిలో కురువడం లేదు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం రిజర్వాయర్‌కు జలకళ వచ్చింది. రెండు వారాల క్రితమే పోతిరెడ్డిపాడు ద్వారా నీరు ఇచ్చే అవకాశం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. మే నెల చివరిలోనే వర్షాలు రావడంతో నంద్యాల జిల్లాలోని కేసీ ఆయకట్టుదారులు ముందుగా పంటలు సాగు చేశారు. కాలువలకు నీరు రాకపోవడం, వర్షాలు కురవకపోవడంతో మొలకొచ్చిన పైర్లన్నీ ఎండిపోయాయి. ప్రస్తుతం పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని విడుదల చేసినా..ఆ నీటిని తెలుగుగంగ ద్వారా వెలుగోడుకు వదులుతున్నారు. ఎస్‌ఆర్‌బీసీకి విడుదల చేయడం లేదు.
ఇదీ నిర్లక్ష్యం
శ్రీశైలం నుంచే ముందుగానే నీటిని రాయలసీమ జిల్లాలకు తరలించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ఎస్‌ఆర్‌ఎంసీతో పాటు, ఎస్‌ఆర్‌బీసీ ప్రధాన కాలువ, గాలేరు–నగరి కాలువలకు లైనింగ్ పనులు చేయించింది. రాయలసీమ లిఫ్ట్‌పై ఉన్న కేసు విషయంలో కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదు. దీంతో ఆ స్కీమ్ పనులు ఏడాది నిలిచిపోయాయి.
● కేసీ కెనాల్ చివరి ఆయకట్టు కోసం నిర్మించాల్సిన రాజోలి, జోళదరాశి ప్రాజెక్టులను, ఆలగనూరు రిజర్వాయర్ పనులను సైతం కూటమి ప్రభుత్వం పక్కకు పెట్టేసింది.
● కర్నూలు–కడప కాలువ నీటిని తాత్కలికంగా నిల్వ చేసేందుకు రిజర్వాయర్లు లేవు. చివరి ఆయకట్టుకు స్థీరికరించేందుకు ఉన్న ఏకై క రిజర్వాయర్ అలగనూరు రిజర్వాయర్(2.95 టీఎంసీలు). అలగనూ రు రిజర్వాయర్ 1985లో రూ.3.06 కోట్లకు కేవలం పరిపాలన ఆమోదం పొందింది. 1993లో కేసీ కెనాల్‌ను జైకా నిధులతో ఆధునీకరించే పనుల్లో భాగంగా రూ.59.90 కోట్లతో రిజర్వాయర్‌ను చేపట్టి.. 2004లో పూర్తి అయ్యాయి. ఈ రిజర్వాయర్ పను లు జరుగుతున్న సమయంలో గడివేముల నుంచి రోళ్ళపాడు గ్రామానికి వెళ్లేందుకు ఉన్న రోడ్డును తొలగించకుండా, ఎలాంటి ట్రెంచెస్ వేయకుండానే నిర్మాణం చేపట్టడంతో 2017లో కట్ట కుంగింది. శాశ్వత పనులు చేసేందుకు మొదటగా రూ.26 కోట్లతో అంచనా వేశారు. తాజాగా అది రూ.36.26 కోట్లకు అంచనాలు పెరిగాయి. ఈ రిజర్వాయర్‌పై సీఎంతో పాటు, మంత్రి సైతం అసెంబ్లీలో హామీనిచ్చినా ప్రకటనకే పరిమితం అయ్యింది.
‘ఘోర’కల్లు

తడవని పొలాలు.. తొలగని రైతుల కష్టాలు