
పాలనలో ‘కూటమి’ విఫలం
ఆత్మకూరు: సుపరిపాలనలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు కల్పలతారెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్‌లో శుక్రవారం పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ’ అనే క్యూఆర్ కోడ్ ఉండే పోస్టర్లను ఆవిష్కరించారు.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా ఉంటామని పార్టీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. అక్రమ అరెస్టులతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే ప్రజలు మోసపోయారని, అధికార పార్టీ నాయకుల బెదిరింపులకు భయపడొద్దన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మోసాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోటా పోటీ చేస్తామన్నారు. పార్టీ నమ్ముకుని పనిచేసే వారికి మంచి పదవులు కట్టబెడతామన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచే కార్యకర్తలకు ఫుల్ పవర్ ఇస్తామని భరోసా ఇచ్చారు. శ్రీశైలం నియోజకవర్గంలో శనివారం వెలుగోడు, బండిఆత్మకూరు, మహానంది మండలాల్లో సమావేశాలు నిర్వహించి శ్రీశైలంలో 14న మండల సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకురాలు కల్పలతారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్ని మోసగించి టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. టీడీపీని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
భయపడే ప్రసక్తే లేదు
మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తామన్నారు. టీడీపీ నాయకులకు, పోలీసులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ఎలాంటి ఘర్షణలకు తావివ్వకుండా ప్రజల సహాయ సహకారాలతో ముందుకు సాగాలన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో ఏ కార్యక్రమం నిర్వహించినా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి విజయవంతం చేస్తున్నారని, అభిమానం మరువలేనిదన్నారు. గ్రామస్థాయిలో నిర్వహించే సమావేశాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు. అంతకుముందు పార్టీ సీనియర్ నాయకులు శిల్పా భువనేశ్వర్‌రెడ్డి, అహ్మద్‌హుసేన్, మహానంది, ఆత్మకూరు మండలాల పార్టీ నాయకులు పాల మహేశ్వర్‌రెడ్డి, సయ్యద్‌మీర్‌లు ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ వెలుగోడు, బండిఆత్మకూరు మండలాల అధ్యక్షులు అంబాల ప్రభాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, పార్టీ నాయకులు సుజాతమ్మ, దర్గమ్మ, దేశం తిరుపంరెడ్డి, విజయ్‌చౌదరి, విజయ్, ఒట్టి వెంకటరెడ్డి పాల్గొన్నారు.
హామీల అమలులో మోసం
రాష్ట్ర ప్రభుత్వ విధానాలను
ఎండగడతాం
వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా
అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి,
మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి

పాలనలో ‘కూటమి’ విఫలం