
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
దేవనకొండ: అప్పుల బాధతో గుడిమిరాళ్ల గ్రామానికి చెందిన గువ్వల రంగస్వామి(45) అనే రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న మూడు ఎకరాల పొలంతో పాటు మరో రెండు ఎకరాలను కౌలుకు తీసుకుని ఈయన పంటలు పండించేవారు. గొర్రెలు, పొట్టేళ్ల పెంపకంతో జీవనం సాగించేవాడు. అయితే గతేడాది పంటలు పండలేదు. పిల్లల పెళ్లిళ్లకు దాదాపు రూ.8 లక్షలు దాకా అప్పు చేశాడు. తనకున్న గొర్రెలను అమ్మినా అప్పు తీరకపోవడంతో ఈయన కొడుకు, కోడలు హైదరాబాద్‌కు వలస వెళ్లారు. అప్పుల బాధతో గురువారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగాడు. ఇంటి పక్కన ఉండే వారు ఈ విషయాన్ని పొలంలో పనిచేస్తున్న కుటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పగా హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. 108 అంబులెన్స్ ద్వారా కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండకు తరలించారు. రంగస్వామికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
మంత్రాలయం: మంత్రాలయంలోని ఓ హోటల్‌లో పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలివి.. కర్ణాటకలోని ఇడపనూరు పోలీస్ పరిధిలోని మల్కాపురం గ్రామానికి చెందిన బోయ దుల్లయ్య కొన్ని రోజులుగా స్థానిక హోటల్‌లో పని మనిషిగా పని చేస్తున్నాడు. గురువారం సాయంత్రం ఆయన కాలకృత్యాలు తీర్చుకోవడానికో.. లేదా ఇతరుల ప్రమేయం మేరకో తెలీదు గానీ ఆర్టీసీ బస్టాండ్ వైపు వెళ్లాడు. ఆర్టీసీ బస్టాండ్ లోపలికి వాహనాలు వెళ్లే స్థలంలో దుల్లయ్య అనుకోకుండా మృత్యువాత పడ్డాడు. మృతుడి ఛాతీ భాగంలో, తొడల భాగంలో కొన్ని కందిన గాయాలు ఉండటంతో అనుమానాలకు తావిస్తోంది.

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య