
మరణించినా ముగ్గురికి ప్రాణదానం
● బ్రెయిన్ డెడ్ అయిన యువకుని
అవయవదానం
కర్నూలు(హాస్పిటల్): రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన యువకు ని అవయవదానంతో మరో ముగ్గురికి ప్రాణదానం చేశారు. నంద్యాల జిల్లా పాములపాడు మండలం కొత్త భానకచర్ల గ్రామానికి చెందిన మొలక రాజు, ఈశ్వరమ్మల కుమారుడైన మొలక తరుణ్(21) ఈ నెల 9వ తేదీన స్కూటర్‌పై వెళుతూ పాములపాడు సమీపంలో అదుపు తప్పి కిందపడ్డాడు. కర్నూలులోని గౌరీగోపాల్ ఆసుపత్రిలో ఈనెల 10వ తేదీన చేరాడు. చికిత్స పొంది ఈ నెల 14వ తేదీన మెడికవర్ హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతూ 16వ తేదీన అతను బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో జీవన్‌దాన్ ద్వారా అవయవదానం గురించి అతని కుటుంబసభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో అవయవదానానికి కుటుంబసభ్యులు అంగీకరించడంతో గురువారం మెడికవర్ హాస్పిటల్‌లో అవయవాలను శస్త్రచికిత్స ద్వారా సేకరించారు. శస్త్రచికిత్సలో యురాలజిస్టు డాక్టర్ అబ్దుల్ సమద్, నెఫ్రాలజిస్టు డాక్టర్ సిద్దార్థ్ హెరూర్, అనెస్తెటిస్ట్ డాక్టర్ ప్రవీణ్ పాల్గొన్నారు. అనంతరం గ్రీన్ చానల్ ద్వారా సేకరించిన అవయవాల్లో పోలీసుల సహకారంతో ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ ఆధ్వ ర్యంలో ఊపిరితిత్తులను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, ఒక కిడ్నీని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి, మరో కిడ్నీని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. అనంతరం తరుణ్ తల్లిదండ్రులను ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎల్.భాస్కర్, ఆసుపత్రి క్లస్టర్ హెడ్ మహేశ్వరరెడ్డి, వైద్యులు తదిత రులు సన్మానించారు.