
● శ్రీశైలంలో భక్తులకు భారమైన వసతి గదుల అద్దె ● ఇబ్బందుల
శ్రీశైలంటెంపుల్: శ్రీశైలక్షేత్ర సందర్శనకు రోజురోజుకు భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. సామాన్య భక్తుడు కుటుంబ సభ్యులతో రెండు రోజుల పాటు క్షేత్రంలో విడిది చేయాలంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురువుతున్నాయి. అంతేకాకుండా వసతి గదులు తక్కువ, రద్దీ రోజుల్లో భక్తులు అధికసంఖ్యలో తరలిరావడంతో క్షేత్రానికి విచ్చేసిన భక్తులందరికీ వసతి గదులు లభించడం కష్టతరంగా మారింది. క్షేత పరిధిలో దేవస్థానం తరఫున వీఐపీ కాటేజీలు 33, గంగా, గౌరీ సదన్ 140, పాతాళేశ్వర సదన్ 50, మల్లికార్జున సదన్ 65, గణేశ సదన్ 224, అంబాసదన్, కుమార సదన్ 80, డార్మెంటరీలు 2, సిద్దిరామప్ప షాపింగ్ కాంప్లెక్స్‌లో సూట్ రూమ్స్, హాల్స్ (100మంది వసతి పొందే) 10 ఉన్నాయి. దేవస్థానం వసతి గదుల్లో సుమారు 6 వేల మందికి వసతి కల్పించే అవకాశం ఉంది. అలాగే క్షేత్ర పరిధిలో 55 కుల సంఘాల చెందిన అన్నతాన సత్రాలు ఉన్నాయి. అన్ని సత్రాలను కలుపుకుంటే సుమారు 5 వేల వసతి గదులు ఉంటాయి. సత్రాల ద్వారా 20 వేల మందికి వసతి కల్పించే అవకాశం ఉంది. దేవస్థానం, సత్రాల వసతి గదులను కలుపుకుంటే సుమారు 25 వేల మందికి మాత్రమే వసతి కల్పించే అవకాశం ఉంది. సాధారణ రోజుల్లో 10 వేల నుంచి 20వేల మంది భక్తులు, శని, ఆది, సోమవారాల్లో 20 వేల నుంచి 35 వేల మంది భక్తులు శ్రీశైలం చేరుకుంటారు. ముఖ్యమైన పర్వదినాల్లో 40వేల నుంచి 60వేల మంది భక్తులు క్షేత్రానికి తరలివస్తారు. రద్దీ రోజుల్లో, ముఖ్యమైన పర్వదినాల్లో భక్తులకు వసతి కష్టాలు తప్పడం లేదు. క్షేత్ర పరిధిలో ఉన్న వసతి గదుల కంటే రెండు రెట్లు అధికంగా భక్తుల రాక ఉండడంతో భక్తులకు వసతి కష్టతరంగా మారింది. అంతేకాకుండా ఇతర దేవస్థానాల మాదిరి కాకుండా శ్రీశైల యాత్రకు వచ్చే భక్తులు తప్పనిసరిగా వసతి సౌకర్యానికి శ్రీశైలంపైనే ఆధారపడాల్సిన పరిస్థితి. దీంతో భక్తులకు వసతి కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. రద్దీ రోజుల్లో ఆరుబయట సేద తీరాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రతిపాదనలు కాగితాలకే పరిమితం..
శ్రీశైల యాత్రకు విచ్చేసిన భక్తులను వసతి కష్టాల నుంచి గట్టెకించేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దృష్టిసారించింది. అదనంగా వసతి గదులు నిర్మించేందుకు బోర్డులో చర్చించి రూ.52 కోట్ల అంచనా వ్యయంతో 200 గదుల వసతి సముదాయాన్ని నిర్మించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆయా ప్రతిపాదనలను దేవదాయశాఖ కమిషనర్ అనుమతి కోసం పంపారు. అయితే ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్నా ఇంతవరకు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు.
గణేశ సదన్
సామాన్యులకు దూరం..
క్షేత్ర పరిధిలో సందర్శనీయ స్థలాలు ఉండటంతో భక్తులు కనీసం ఒక రోజు ఇక్కడే ఉండాల్సి వస్తుండటంతో వసతి కోసం గదులు అద్దెకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీశైల యాత్రకు విచ్చేసిన ఓ కుటుంబం (ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు) క్షేత్రంలో విడిది చేయాలంటే ఒక్క రోజు ఎంత తక్కువ అద్దె అయినా కనీసం రూ.800 పైనే చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎక్కువ మంది ఉంటే రెండు రూములు తీసుకోవాల్సిందే. మల్లికార్జునసదన్‌లో వసతిగది అద్దె రూ.1,200, సూట్‌రూము రూ.1,700, గణేశసదన్‌లో రూ.2000, వీఐపీ కాటేజీలు రూ.5 వేల నుంచి 10వేల వరకు ఉన్నాయి. శ్రీశైలంలో రెండు, మూడు రోజుల పాటు బస చేసి స్వామిఅమ్మవార్ల దర్శనంతో పాటు చుట్టుపక్కల ఉన్న సందర్శనీయ స్థలాలను సందర్శించాలంటే ఆర్థిక భారమవుతోంది.
ఈశ్వరా.. భక్తులకు వసతి కష్టాలు ఇంకెన్నాళ్లు!
టీటీడీ తరహాలో వసతి
కల్పనకు ప్రణాళికలు
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైల దేవస్థానంలో కూడా సామాన్య భక్తులకు వసతి సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేశాం. అమెరికాకు చెందిన ఓ డోనర్ సామాన్య భక్తుల వసతి సముదాయం నిర్మాణం కోసం రూ.1.50 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. దాతల సహకారంతో వసతి సముదాయాన్ని నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. పెద్ద డార్మెంటరీలను నిర్మించి రూ.100కే బెడ్, లాకర్, స్నానానికి, బాత్‌రూం సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– ఎం.శ్రీనివాసరావు, శ్రీశైల దేవస్థాన ఈఓ

● శ్రీశైలంలో భక్తులకు భారమైన వసతి గదుల అద్దె ● ఇబ్బందుల

● శ్రీశైలంలో భక్తులకు భారమైన వసతి గదుల అద్దె ● ఇబ్బందుల