
రేపు అనంతపురంలో వ్యవసాయ అధికారుల బదిలీలు
కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ శాఖలో మండల వ్యవసాయ అధికారులు, సహాయ సంచాలకులు, సీనియర్ అసిస్టెంట్లు, సూపరిటెండెంట్లు, పరిపాలన అధికారుల బదిలీల ప్రక్రియ జోనల్ స్థాయిలో సోమవారం అనంతపురంలో జరుగనుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మండల వ్యవసాయ అధికారుల్లో ఒకే స్టేషన్‌లో ఐదేళ్లు పైబడి పని చేస్తున్న వారు 32 మంది ఉన్నారు. ఏడీఏల్లో ఒకరు లాంగ్ లీవ్‌లో ఉన్నారు. ఒకే స్టేషన్‌లో ఐదేళ్లు పైబడి పని చేస్తున్నవారు ఆరుగురు ఉన్నారు. వీరందరు బదిలీ కావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం రిక్వెస్ట్‌పై జీరో సర్వీస్ ఉన్న వారు కూడా బదిలీకి అర్హులేనని ప్రకటించడంతో వ్యవసాయ శాఖలో బదిలీల జాతర నెలకొంది. జిల్లాలో కల్లూరు, ఆదోని, ఎమ్మిగనూరు మండలాలకు గతంలో ఎపుడూ లేని పెద్ద ఎత్తున పైరవీలు నడుస్తున్నాయి. ఇప్పటికే కూటమి పార్టీల నేతలను ముడుపులతో ప్రసన్నం చేసుకుని లైన్ క్లియర్ చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిఫార్స్ లేఖలతో దరఖాస్తులు చేసుకున్నారు. లేఖలతో పాటు ఫోన్‌లు కూడా చేయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సోమవారం బదిలీలకు శ్రీకారం చుట్టనున్నారు. రాయలసీమ జిల్లాల్లో అనంతపురం డీఏఓ సీనియర్ కావడంతో అక్కడ అడిషినల్ డైరెక్టర్ కృపానందం ఆధ్వర్యంలో బదిలీలు చేపట్టనున్నారు.