
విజిలెన్స్ అధికారుల సోదాలు
ఆదోని అర్బన్: విజిలెన్స్ అధికారులు శనివారం పట్టణంలో సోదాలు నిర్వహించారు. రైతు బజారులోని మూడు కిరాణాషాపుల్లో ఎటువంటి లైసెన్సులు లేకపోవడంతో కేసు నమోదు చేసినట్లు జిల్లా సివిల్ సప్లై అధికారి రాజారఘువీర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫుడ్ సప్లై చేస్తున్న వారిపై కేసు నమోదు చేశామన్నారు. అంతకుముందు వ్యవసాయ మార్కెట్‌యార్డులో వేరుశనగకాయల దిగుబడులను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. తూకాల్లో ఏవైనా మోసాలు జరుగుతున్నాయా, పట్టీలు ఎక్కువ తక్కువ వేస్తున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని వంటశాలను పరిశీలించారు. అపరిశుభ్ర వాతావరణంలో వంట చేయడం, కోడిగుడ్ల సైజు చిన్నగా ఉండటంతో కేసు నమోదు చేశారు. రైతు బజారులోని లైసెన్స్ లేని మూడు కిరాణాషాపులపై కేసు నమోదు చేశారు. పెట్రోల్ బంకును తనిఖీ చేసి, టాయిలెట్లు సరిగాలేవని, వాహనాలకు ఉచితంగా గాలి పట్టే సౌకర్యం ఏర్పాటు లేదని గుర్తించారు. అనంతరం వాటర్ ప్లాంటును పరిశీలించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి లీటర్ బాటిళ్లు బిల్లులు లేకుండా సరఫరా అవుతుండటం, వాటర్ ప్యాకెట్లపై సీల్ లేకుండా ఉండడంపై ఆరా తీశారు. అనంతరం జిల్లా సివిల్ సప్లై అధికారి రాజారఘువీర్ మాట్లాడుతూ కర్నూలు, ఆదోనిలో తనిఖీలు నిర్వహించామన్నారు. నివేదికలను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. తనిఖీల్లో ఫుడ్‌సేఫ్టీ అధికారి రాజగోపాల్, అసిస్టెంట్ మార్కెట్‌యార్డు డైరెక్టర్ నారాయణమూర్తి, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓ సత్యవతి, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, అసిస్టెంట్ కంట్రోలర్ లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీరాములు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ సందీప్, కన్జూమర్ ప్రొటెక్షన్ సెక్రటరీ శివమోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
● ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఫుడ్ సప్లై సిబ్బందిపై కేసు నమోదు