
యువకుడిని మింగిన బావి!
ఉయ్యాలవాడ: స్నేహితులతో కలిసి ఉత్సాహంగా ఉండే యువకుడిని ఓ బావి మృత్యువు రూపంలో కబళించింది. ఈ విషాద ఘటన శుక్రవారం సాయంత్రం గోవిందపల్లె గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన షేక్ బాబ్జాన్ అలియాస్ రిజ్వాన్(25) అనే యువకుడు తోటి స్నేహితులతో ఈత కొట్టేందుకు గోవిందపల్లె గ్రామంలో బావికి వెళ్లాడు. ఈత రాకపోయిన నడుముకు ఖాళీ 5 లీటర్ల క్యాన్‌లు నాలుగు కట్టుకుని బావిలో దూకాడు. నడుముకు కట్టుకున్న క్యాన్‌లు తెగి పోవడంతో నీటిలో మునిగి పోయాడు. గమనించిన తోటి స్నేహితులు బావిలో గాలించగా యువకుడు లభ్యం కాలేదు. స్నేహితులు గట్టిగా కేకలు వేయడంతో గ్రామస్తులు వచ్చి బావిలో దూకి అతడిని బయటకు తీశారు. వెంటనే 108 వాహనంలో కోవెలకుంట్ల పట్టణానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యాధికారి తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణానికి చెందిన షేక్ ఖాదర్‌వలి కుటుంబ సభ్యులు అందరూ గోవిందపల్లె గ్రామంలోని అచ్చుకట్ల బుడ్డే సాహెబ్ ఇంటికి వచ్చారు. షేక్ ఖాదర్‌వలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిలో ఒక కుమారుడు మృత్యువాత పడడంతో ఆ కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

యువకుడిని మింగిన బావి!