
‘సూచనల’ మూగ నోము!
● శ్రీశైలంలో ఆగిపోయిన ‘డయల్ యువర్ ఈఓ’ ● నామమాత్రంగా సూచనల బాక్సుల ఏర్పాటు
శ్రీశైలం టెంపుల్: దేశ నలుమూలల నుంచి జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి వచ్చే భక్తులు తమ కష్టాలను ఎవరి చెప్పుకోవాలో తెలియక మూగు నోము పాటిస్తున్నారు. గతంలో భక్తుల సలహాలు, సూచనలు, ఫిర్యాదులు స్వీకరించేందుకు డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి అధికారులు ఎగనామం పెట్టారు. దీంతో భక్తుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకు రావడం లేదు. శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో కల్పిస్తున్న సౌకర్యాలు భక్తులకు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయి.. ఇంకా ఎటువంటి సౌకర్యాలు మెరుగుపర్చాలి.. తదితర వివరాలు తెలుసుకునేందుకు శ్రీశైలంలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని 2021 డిసెంబరు 22న ప్రారంభించారు. ఇందుకోసం 08524–287111 నంబరును కేటాయించారు. ప్రతి బుధవారం ఉదయం 11గంటల నుంచి 12గంటల వరకు భక్తులు ఫోన్ చేసి తమ సలహాలు, సూచనలు, ఫిర్యాదులు ఇచ్చేవారు. కొన్ని వారాల పాటు సజావుగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం నెలలో ఒక రోజు మాత్రమే నిర్వహించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని ఎత్తివేశారు.
ఉపయోగంలేని బాక్స్‌లు
డయల్ యువర్ ఈఓ కార్యక్రమానికి ప్రత్యామ్నాయంగా ఫిర్యాదుల బాక్స్‌లను ఏర్పాటు చేశారు. దేవస్థాన పరిపాలనా భవనం వద్ద, వసతి గదుల కేంద్రాల వద్ద, సీఆర్‌వో కార్యాలయం, క్యూలైన్ల వద్ద, అన్నప్రసాద వితరణ భవనం వద్ద వీటిని ఉంచారు. భక్తులు వీటిని వినియోగించడం లేదు.
పునఃప్రారంభించేందుకు చర్యలు
శ్రీశైల దేవస్థానంలో డయల్ యువర్ ఈఓ కార్యక్రమాన్ని పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటాం. భక్తుల నుంచి ఫిర్యాదులు, సలహాలు, సూచనలు స్వీకరిస్తాం. ఆయా విభాగాల అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంటుంది. – ఎం. శ్రీనివాసరావు,
శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి

‘సూచనల’ మూగ నోము!