
చిన్నారులకు అగ్ని పరీక్ష
కోవెలకుంట్ల: ఏటా వేసవికాలం ప్రారంభం కాగానే మార్చి 15 నుంచి పాఠశాలలకు ఒంటి పూటబడులు, ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇస్తున్నారు. పూర్వప్రాథమిక విద్యనభ్యసించే చిన్నారులకు వేసవికాలం శిక్ష తప్పడం లేదు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించగా అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు వర్తింపచేయకుండా కూటమి సర్కార్ చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతోంది. జిల్లాలోని 29 మండలాల పరిధిలో1,620 అంగన్‌వాడీ, 43 మినీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో 1.23 లక్షల మంది సున్న నుంచి 6 సంవత్సరాల్లోపు చిన్నారులకు 1,663 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు పూర్వప్రాథమిక విద్యను బోధిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు లేకపోవడంతో వేసవిలో కేంద్రాలను నిర్వహించాల్సిందే. అంగన్‌వాడీ కేంద్రంలో ఏడాది నుంచి ఆరు సంవత్సరాల్లోపు వయస్సు ఉన్న వారే. అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించకుండా వేళల కుదింపుతో సరిపెట్టడంతో చిన్నారులకు వేసవికాలం అగ్ని పరీక్షగా మారింది. వసతులు లేమి, అద్దె భవనాలు, మండుటెండలు చిన్నారులకు శాపంగా మారాయి. జిల్లాలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో సగానికిపైగా కేంద్రాలకు సొంత భవనాలు లేవు. కొన్ని ప్రభుత్వ భవనాల్లో వసతులు లేవు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నుంచే ఎండలు అధికమయ్యాయి. ఫ్యాన్లు కూడా లేని అంగన్‌వాడీ కేంద్రాలు జిల్లాలో కోకొల్లలుగా ఉన్నాయి. ఈ కేంద్రాల్లో ఫ్యాన్లు అటుంచితే గాలి, వెలుతురు లేక చిన్నారుల బాధలు వర్ణనాతీతం. వేసవికాలం కావడంతో ఉదయం 9 గంటల నుంచే భానుడి విశ్వరూపానికి జనాలు విలవిల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో అంగన్‌వాడీలకు వెళ్లే ఆరేళ్లలోపు చిన్నారుల అవస్థలు వర్ణనాతీతం.
చిన్నారులకు తప్పని వేసవి సెగ
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు గత నెల 15వ తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తుండగా అంగన్‌వాడీ కేంద్రాలను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వర కు నిర్వహిస్తున్నారు. విద్యాశాఖ పాఠశాలలకు ఈ నెల 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించగా అంగన్‌వాడీ కేంద్రాలను ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే వేసవి కాలాన్ని దృిష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పనివేళలను కుదించింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఎండతీవ్రత అధికంగా ఉండటంతోపాటు ఉక్కపోతతో కేంద్రాల్లో చిన్నారులు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్న భోజనం అనంతరం చిన్నారులను ఇళ్లకు పంపివేసి కార్యకర్తలు, ఆయాలు ఇళ్లకు వెళుతున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు వర్తిపంచేయాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
కార్యకర్తలు, ఆయాలకు
15 రోజుల సెలవులు
అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యనభ్యసించే చిన్నారులకు ఎలాంటి వేసవి సెలవులు లేకపోగా ప్రభుత్వం కార్యకర్తలు, ఆయాలకు నామమాత్రపు వేసవి సెలవులతో సరిపెట్టింది. మే 1వ తేదీ నుంచి ఆయాలకు 15 రోజులపాటు మే 16 నుంచి 31వ తేదీ వరకు కార్యకర్తలకు వేసవి సెలవులున్నాయి. ఆయాలకు 15 రోజులు, కార్యకర్తలకు 15 రోజుల చొప్పున సెలవులు కేటాయించింది. మొదటి పదిహేను రోజులు అంగన్‌వాడీ కార్యకర్తనే ఆయా బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి ఉంది. చిన్నారులను కేంద్రాలకు వచ్చేలా చూడటం, విద్యబోధించడం, మధ్యాహ్న భోజనం అందించడం, తదితర పనులు చేపట్టాల్సి ఉంది. తర్వాతి పదిహేను రోజులు కార్యకర్త విధులు ఆయా నిర్వర్తించాల్సి ఉంది. జూన్ 1వ తేదీ నుంచి అంగన్‌వాడీ కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు యధావిధిగా కొనసాగుతాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు లేకపోగా ప్రతి నెలా రెండవ శనివారం, కొన్ని ప్రభుత్వ సెలవు రోజుల్లో సైతం కేంద్రాలను నిర్వహించాల్సి వస్తోంది.
ఈ నెల 24 నుంచి పాఠశాలలకు
వేసవి సెలవులు
అంగన్‌వాడీ కేంద్రాలకు ఇవ్వని వైనం
చిన్నారులకు తప్పని వేసవి సెగ
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు:
1,620
మినీ అంగన్‌వాడీ కేంద్రాలు: 43
0–6 నెలల శిశువులు: 16,434
7 నెలలు– మూడేళ్లలోపు: 66,054
3–6 సంవత్సరాల్లోపు చిన్నారులు: 41,216