సార్‌.. బూటకపు హామీలు నమ్మి మోసపోయాం | - | Sakshi
Sakshi News home page

సార్‌.. బూటకపు హామీలు నమ్మి మోసపోయాం

Mar 8 2025 1:51 AM | Updated on Mar 8 2025 1:46 AM

డోన్‌: గత ఎన్నికల సమయంలో కూటమి నాయకుల బూటకపు వాగ్దానాలు నమ్మి మోసపోయామని పలువురు మహిళలు మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో వాపోయారు. స్థానిక పాతపేట శ్రీరాముల దేవాలయం సమీపంలో నివసిస్తున్న వంట మాస్టర్‌ కుమ్మరి నాగరాజు ఇటీవల మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను శుక్రవారం రాత్రి మాజీ మంత్రి బుగ్గన పరామర్శించారు. వైఎస్సార్‌సీపీతో పాటు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని మృతుని కుటుంబ సభ్యులకు ఆయన హామీ ఇచ్చారు. అనంతరం తిరిగి బయలుదేరుతున్న మాజీ మంత్రితో కొందరు మహిళలు తమ గోడును వెల్లబోసుకున్నారు. కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా తమను వంచించిందన్నారు. సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. తొమ్మిది నెలలు గడిచినా ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, ప్రతి ఆడ పిల్లకు ప్రతినెలా రూ.1,500, అన్నదాత సుఖీభవా ఇవ్వలేదని బుగ్గన దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబును నమ్మి ఇప్పుడు ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసం ప్రజలకు అర్థమైందని, 2029 ఎన్నికల్లో తిరిగి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని, అప్పటి వరకు ఓపిక పట్టాలని మహిళలకు భరోసా కల్పించారు. ఆయన వెంట మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జాకీర్‌ హుస్సేన్‌, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కురుకుందు హరి, వలంటీర్‌ విభాగం జిల్లా అధ్యక్షుడు పోస్టు ప్రసాద్‌, యువజన విభాగం అధ్యక్షుడు ఆర్‌ఈ రాజవర్దన్‌, కౌన్సిలర్లు కటికె వేణు, కురుకుందు పద్మావతి, కో ఆప్షన్‌ సభ్యులు కుమ్మరి రాజు తదితరులు ఉన్నారు.

మాజీ మంత్రి బుగ్గనతో వాపోయిన మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement