మూగజీవాలు విలవిల | - | Sakshi
Sakshi News home page

మూగజీవాలు విలవిల

Mar 4 2025 12:53 AM | Updated on Mar 4 2025 12:54 AM

సోమవారం మధ్యాహ్నం నిర్మానుష్యంగా డోన్‌ ఆర్టీసీ బస్టాండ్‌

చెట్ల నీడన సేదతీరుతున్న

గొర్రెలు, మేకలు

కౌతాళం: మండలంలో వారం రోజులుగా పెరుగుతున్న ఎండ తీవ్రతకు ప్రజలతో పాటు మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. మండలంలో ఎండల తీవ్రత 35డిగ్రీలకు తగ్గకుండా నమోదవుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. ఎండల తీవ్రత నానాటికీ పెరిగిపోతుండటంతో మండల పరిదిలోని ఉరుకుంద గ్రామ శివారులో గొర్రెలు, మేకలు చెట్ల కింద సేదతీరడం కనిపించింది. రానున్న రోజుల్లో తీవ్రతకు ఈ దృశ్యం అద్దం పట్టింది.

ఈ వేసవి నిప్పుల కొలిమే!

మార్చి నుంచి మే వరకు

అధిక ఉష్ణోగ్రతలు

గత ఏడాది అత్యధికంగా

47 డిగ్రీలు నమోదు

ఈ సారి 48 డిగ్రీలకు చేరుకునే

అవకాశం

వేసవి తీవ్రత పెరుగుతున్నా

కనిపించని ఉపశమన చర్యలు

జాడలేని చలువ పందిళ్లు,

చలివేంద్రాలు

ఈ నెల 1 నుంచి నమోదైన

ఉష్ణోగ్రతల వివరాలు

తేదీ కర్నూలు నంద్యాల

గరిష్టం–కనిష్టం గరిష్టం–కనిష్టం

1వ తేదీ 36.8-20.0 36.4-18.6

2వ తేదీ 37.0-23.1 37.0-20.0

3వ తేదీ 39.5-22.0 38.5-23.6

ఈత.. కేరింత

దొర్నిపాడు: రోజురోజుకూ వేసవి ముదురుతోంది. పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైగా నమోదు అవుతుండంతో జనాలు భానుడి సెగకు తట్టుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో చిన్నారులు వేసవి తాపం తాళలేక క్రిష్టిపాడు గ్రామంలోని కుందూనదిలో ఈతకు వెళ్లి కేరింతలు కొట్టడం కనిపించింది.

వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు ఇలా..

కర్నూలు(అగ్రికల్చర్‌): గత ఏడాది ఉమ్మడి కర్నూలు జిల్లాలో రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్న ప్రాంతంగా గుర్తింపు పొందింది. ఈ సారి కూడా భానుడి భగభగలు గత ఏడాది కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు, మూడేళ్లతో పోలిస్తే ఈ సారి సూర్య ప్రతాపం పెరుగనుంది. ఏప్రిల్‌ మొదటి వారంలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు మార్చి నెలలోనే కనిపిస్తుండటంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత ఏడాది అత్యధికంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దేశంలోనే ఇది అత్యధిక ఉష్ణోగ్రత. రాష్ట్రంలో సాధారణంగా అత్యధిక ఉష్ణోగ్రతలు రెంటచింతలలో నమోదవుతాయి. అలాంటిది అక్కడి కంటే ఇక్కడ రెండు, మూడు డిగ్రీలు ఎక్కువ నమోదు అవుతుండటం గమనార్హం. మార్చి నెల చివరికి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు, ఏప్రిల్‌ నెలలో 45 డిగ్రీలకు, మే నెలలో 47/48 డిగ్రీలకు చేరుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. గత ఏడాది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండల తీవ్రత ఉన్నా సాయంత్రానికి అకాల వర్షాలు పడటం, గాలుల వల్ల కాస్త ఉపశమనం లభించింది. ఈ సారి అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పెరుగుతున్న వడగాలులు

గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటే వాతావరణం చల్లగా ఉంటుంది. ఫిబ్రవరి నెలతో పోలిస్తే గాలిలో తేమ తగ్గింది. ఈ కారణంగా వడగాలులు మొదలయ్యాయి. భూగర్భ జలాలను ఎక్కువగా వినియోగిస్తుండటం వల్ల భూమిలో నీటి నిల్వలు రోజురోజుకు ఇంకిపోతున్నాయి. అక్టోబర్‌ నుంచి వర్షాలు లేవు. ఇందువల్ల భూమిలో తేమ లేక ఎండల తీవ్రతకు పెరిగి నేల నుంచి వేడి సెగలు పుట్టుకొస్తున్నాయి. అడవులు తరిగిపోతుండటం, పచ్చదనం కనుమరుగు అవుతుండటం కూడా ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతోంది. జిల్లా విస్తీర్ణంలో అడవులు 33 శాతం ఉండాల్సి ఉండగా.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 16 శాతం మాత్రమే అడువులు ఉన్నట్లు తెలుస్తోంది. వాహనాల సంఖ్య పెరిగి వాయు కాలుష్యం అధికమవడం కూడా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణంగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటితే వేడి గాలులు మొదలవుతాయి. దీనినే హీట్‌వేవ్‌గా వ్యవహరిస్తారు. ఇప్పుడు 38 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. అప్పుడే వడగాలులు మొదలు కావడం ఆందోళన కలిగించే విషయం.

పెరిగిన విద్యుత్‌ వినియోగం

ఎండల తీవ్రతతో విద్యుత్‌ వినియోగం కూడా గణనీయంగా పెరుగుతోంది. ఏసీలకు తోడు కూలర్లు, ఫ్యాన్ల వినియోగం అధికమైంది. ఉమ్మడి జిల్లాలో ఫిబ్రవరి 1న 15లక్షల మిలియన్‌ యూనిట్ల వినియోగం ఉండగా.. ఈ నెల 1న వినియోగం 16.02 లక్షల మిలియన్‌ యూనిట్లకు చేరుకుంది. రికార్డు స్థాయిలో లక్ష మిలియన్‌ యూనిట్లకుపైగా వినియోగం పెరగడం గమనార్హం. రానున్న రోజుల్లో ఎండలు, వడగాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉండటంతో విద్యుత్‌ వినియోగం 20 లక్షల మిలియన్‌ యూనిట్లకు పైగా పెరిగే అవకాశం ఉందని విద్యుత్‌ అధికారులు అంచనా.

వడదెబ్బ లక్షణాలు: తలనొప్పి, తలతిరగడం, తీవ్రమైన జ్వరం, మత్తునిద్ర, ఫిట్స్‌, పాక్షిక లేదా పూర్తి అపస్మారక స్థితి.

ఉపాధి, పొలం పనులకు వెళ్లే వాళ్లు సాధ్యమైనంత వరకు ఉదయం 11 గంటల్లోపు ఇంటికి చేరుకోవాలి.

ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకెళ్ల్లాలి.

కనీసం తలపైన టోపి లేదా టువాలను కప్పుకోవాలి.

కళ్ల రక్షణకు సన్‌ గ్లాసెస్‌ ఉపయోగించాలి.

దాహం వేయకపోయినా తరచూ చల్లని నీరు

ఎక్కువగా తీసుకోవాలి.

కొద్దిగా ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు, కొబ్బరి నీళ్లు

వీలైనంత వరకు తాగుతుండాలి.

వేసవిలో తెల్లని వస్త్రాలు ధరించడం ఉత్తమం.

మధ్యాహ్నం 11 నుంచి 4 గంటల మధ్య శారీరక శ్రమతో కూడిన పనులు చేయరాదు. బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగరాదు.

48 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం

మార్చి నుంచి మే నెల చివరి వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణం కంటే 3–4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.ఈ సారి ఏప్రిల్‌, మే నెలల్లో ఉష్ణోగ్రత 47–48 డిగ్రీల వరకు చేరుకోవచ్చు. గాలిలో తేమ శాతం తగ్గుతున్నందున వడగాలుల ప్రభావం ఉంటుంది. – నారాయణ స్వామి,

సీనియర్‌ వాతావరణ శాస్త్రవేత్త

ఉపశమన చర్యలు శూన్యం

2024 వేసవి వరకు ముందస్తుగానే ఉపశమన చర్యలు తీసుకోవడం కనిపించింది. కలెక్టరేట్‌లోకి వెళ్లే ప్రాంతంలో ఇరువైపులు, కలెక్టరేట్‌ బస్టాపు, రాజ్‌విహార్‌, బళ్లారి చౌరస్తా, సి.క్యాంపు సెంటర్‌, ట్రాఫిక్‌ సిగ్నల్‌ పడే ప్రాంతాల్లో చలువ పందిళ్లు ఏర్పాటు చేసేవాళ్లు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు ఏర్పాటు చేయడం చూశాం. పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, గ్రామాల్లో పంచాయతీలు ఉపశమన చర్యలు తీసుకోవాల్సి ఉన్నా ఆ దిశగా ఇప్పటి వరకు చర్యలు కరువయ్యాయి. ఉపాధి పనులు జరిగే ప్రాంతాల్లోనూ నీడ సదుపాయం కల్పిస్తున్న దాఖలాల్లేవు.

మూగజీవాలు విలవిల 
1
1/4

మూగజీవాలు విలవిల

మూగజీవాలు విలవిల 
2
2/4

మూగజీవాలు విలవిల

మూగజీవాలు విలవిల 
3
3/4

మూగజీవాలు విలవిల

మూగజీవాలు విలవిల 
4
4/4

మూగజీవాలు విలవిల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement