
అమ్మవారి ఆలయానికి చేరుకున్న జ్యోతులు
బనగానపల్లెరూరల్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన నందవరం చౌడేశ్వరి మాత జ్యోతి మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. జ్యోతులు ప్రజ్వలించగా.. భక్తి భావం ఉప్పొంగింది. ‘చౌడేశ్వరి దేవి చల్లగా దీవించి తల్లీ’ అంటూ భక్తులు ప్రణమిల్లారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో నందవరం గ్రామం భక్తజన సంద్రంగా మారింది. ఈ నెల 22న ప్రారంభమైన జ్యోతి మహోత్సవాల్లో భాగంగా శనివారం అర్ధరాత్రి కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. ఆలయ సంప్రదాయంలో భాగంగా ముందుగా భాస్కరయ్య ఆచారిచే అమ్మ వారికి దిష్టి చుక్క పెట్టు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఒంటిగంట సమయంలో స్థానిక శ్రీ చెన్నకేశస్వామి దేవస్థానం వద్ద ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన తొగట వీరక్షత్రీయులు, అమ్మ వారి భక్తులు గోధమ పిండి, నెయ్యి, బెల్లం తదితర పదార్థాలతో జ్యోతులు తయారు చేసి తలపై ఉంచుకొని అమ్మవారి భక్తిగీతాలు ఆలపిస్తూ మేళతాళాలతో ఆలయానికి బయలుదేరారు. మొదట సర్కార్ వారి జ్యోతిని భక్తులు తీసుకోస్తుండగా ఈ జ్యోతి వెంట మిగిలిన జ్యోతులు ప్రదర్శనగా గ్రామచావిడి, బస్టాండ్ మీదుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నాయి. జ్యోతులతో వచ్చిన భక్తులు ఆలయం ఎదుట అగ్నిగుండంలో నడుచుకుంటూ గర్భగుడిలో కొలువైన శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. తొగటవీర క్షత్రియులు ప్రదర్శించిన కత్తి సాము ప్రదర్శన ఆకట్టుకుంది. జ్యోతుల ముందు కత్తి సాము ప్రదర్శను భక్తులు ఆసక్తిగా తిలకించారు.
భారీగా తరలివచ్చిన భక్తజనం
గతంలో ఎప్పుడూ లేనంతగా జ్యోతులు అధిక సంఖ్యలో రావడంతో పాటు భక్తులు వేలాదిగా తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. క్యూలైన్లు కిక్కిరిసిపోయి అమ్మవారి దర్శనానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, బనగానపల్లె సీఐ సుబ్బరాయుడు, ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చేపట్టారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సతీమణి కాటసాని జయమ్మతో పాటు పలువురు ప్రముఖులు అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. సాయంత్రం శ్రీ చౌడేశ్వరిదేవి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉంచి రథోత్సవాన్ని నిర్వహించారు. గ్రామ ముఖ ద్వారం వరకు చేరుకోగా, సోమవారం తిరుగు రథోత్సవం నిర్వహించనున్నారు.
వైభవంగా చౌడేశ్వరి
జ్యోతి మహోత్సవం
ఆకట్టుకున్న తొగటవీర
క్షత్రియుల కత్తిసాము ప్రదర్శన

తొగట వీరక్షత్రియ భక్తుల కత్తిసాము ప్రదర్శన

ఆలయ ఆవరణలో కిక్కిరిసిన భక్తులు

శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారు