గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమించాం | - | Sakshi
Sakshi News home page

గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమించాం

Jun 2 2026 5:53 AM | Updated on Jun 2 2026 5:53 AM

మిర్యాలగూడ : తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని గల్లి నుంచి ఢిల్లీ దాక వినిపించాం. 1991 నుంచే పోస్టుకార్టు ఉద్యమాలతోపాటు 1997లో మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర బోర్డు ఏర్పాటు చేశాం. కృష్ణాజలాలు, సాగునీటి కోసం ఎడమకాల్వపై పాదయాత్ర నిర్వహించాం. ప్రత్యేకంగా తెలంగాణ కావాల వద్దా అని రెఫరెండం పెట్టి ప్రజల మద్దతును కూడగట్టాం. ఇక్కడి నుంచి ఢిల్లీకి ప్రజలతో కలిసి సోనియాగాంధీకి ఇటలీ భాషలో ఉత్తరం రాశాం. సరిహద్దులో సభలు ఏర్పాటు చేసి గ్రామగ్రామాన పాదయాత్రలు చేపట్టి వినూత్న నిరసనలు చేపట్టాం. కేసీఆర్‌, గద్దర్‌, విమలక్క, జయశంకర్‌, కోదండరామ్‌లను ఆహ్వానించి మా ప్రాంతంలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేశాం.

– వేనేపల్లి పాండురంగారావు (మట్టిమనిషి)

ఉద్యమకారులను గౌరవించాలి

డాక్టర్‌ చెరుకు సుధాకర్‌

నకిరేకల్‌ : ‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తాను అనేక కేసుల్లో ఐదు మాసాలు జైలు జీవితం గడిపాను. అనేక పోరాటల నడుమ స్వరాష్ట్రాన్ని సాధించి పుష్కరకాలం (12 ఏళ్లు) అవుతోంది. ఇక, నిర్బంధాలు లేని తెలంగాణ కావాలి. రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను గౌరవించాలి’ అని తెలంగాణ ఉద్యమకారుడు, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన ‘సాక్షి’ తో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేసిన వారి జీవిత కాలంలో జూన్‌ 2వ తేదీ పండుగ రోజు. ఉద్యమకారుడు ఎవరైనా గర్వంగా ఫీల్‌ అవ్వాలి. చేతనైతే రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలి. రాష్ట్రం కోసం పోరాడిన వారి కోసం ప్రభుత్వాలు పని చేయకపోతే నిలదీయాలి.

ఐదు నెలలు జైలు జీవితం గడిపాను

నేను స్వరాష్ట్ర ఏర్పాటు కోసం 1997లో జరిగిన ‘తెలంగాణ మహాసభ’ నుంచి ఎన్నో పోరాటాలు చేసి జైలుకు పోయివచ్చాను. మలిదశ ఉద్యమం 2009 నుంచి రాష్ట్రం వచ్చేంత వరకు జరిగిన అనేక పోరాటాల నడుమ, నాపై పెట్టిన వివిధ కేసుల వల్ల మొత్తం ఐదు నెలల పాటు జైలు జీవితం గడిపాను. ఆనాటి సమైక్య ప్రభుత్వం నాపై పీడీ యాక్ట్‌తో పాటు ఇతర అనేక కేసులను ప్రయోగించింది. పీడీ యాక్ట్‌ కింద ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష పడే అవకాశాలు ఉన్నప్పటికీ, కోర్టు ఇచ్చిన తీర్పులతో నేను ఆ శిక్షల నుంచి బయటపడ్డాను.

నిర్బంధాలు లేని తెలంగాణ కావాలి

స్వరాష్ట్రంలో పౌర, మానవ హక్కులు ఉండాలని పోరాడాం. వాటిని ఎక్కడ అణచివేసినా ఎదురించాలి. నీళ్లు, నిధులు, నియామకాలు మాత్రమే కాదు.. నిర్బంధాలు లేని స్వేచ్ఛను అనుభవించే తెలంగాణ, సామాజిక న్యాయం ఉన్న తెలంగాణ, రాష్ట్రం కోసం పోరాడిన వారిని గౌరవించే తెలంగాణ కావాలన్నదే మా ఆకాంక్ష. రాష్ట్రం కోసం పోరాడిన వారంతా పుష్కర స్నానం చేసినంత పుణ్యం లభించినట్లుగా భావించాలి. నేడు గుండెల నిండా స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటూ గర్వపడాలి.

Advertisement
 
Advertisement
Advertisement