కరువు నేలను తడిపేందుకు ఎత్తిపోతలు | - | Sakshi
Sakshi News home page

కరువు నేలను తడిపేందుకు ఎత్తిపోతలు

Jun 2 2026 5:53 AM | Updated on Jun 2 2026 5:53 AM

కరువు నేలను తడిపేందుకు ఎత్తిపోతలు

డిండి : నల్లగొండ జిల్లాలోని ఫ్లోరోసిస్‌ ప్ర భావిత ప్రాంతాల ప్రజలకు రక్షిత నీరు, బీడు భూములకు సాగు నీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పలు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా 2015లో శివన్నగూడెంలో డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా కిష్టరాంపల్లి, చింతపల్లి, శివన్నగుడెం, గొట్టిముక్కుల, సింగరాజుపల్లిలో రిజర్వాయర్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్‌ నుంచి నీటిని తరలించి జిల్లాలో నిర్మించే ఐదు రిజర్యాయర్లు నింపితే.. దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాల్లో 3.61 ఎకరాలకు సాగునీరుతోపాటు ప్రజలకు తాగునీటి కష్టాలు దూరం కానున్నాయి. ప్రస్తుతం ఈ ఎత్తిపోతల పనులు పురోగతిలో ఉన్నాయి.

● సాగర్‌ ఆయకట్టు చివరి భూములకు, ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలో ఐదు ఎత్తిపోతల పథకాలను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిలో బొత్తలపాలెం, దున్నపోతులగండి, కేశవాపురం– కొండ్రపోల్‌, వీర్లపాలెం, తోపుచర్ల లిఫ్ట్‌ పనులు ప్రగతిలో ఉన్నాయి.

● దశాబ్దాల కాలంగా కృష్ణపట్టె గిరిజన రైతాంగం ఎదురుచూస్తున్న నెల్లికల్లు ఎత్తిపోతలను గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సాకారం చేసింది. రూ.692 కోట్లతో ఈ లిఫ్ట్‌ పనులు సాగుతున్నాయి.

ఫ్లోరోసిస్‌ మహమ్మారి నుంచి విముక్తి

నల్లగొండ : ఒకప్పుడు నల్లగొండ జిల్లా పేరు వినగానే గుర్తుకొచ్చేది ఫ్లోరోసిస్‌ సమస్య. ఇక్కడ వేలాది మంది ప్రజలు ఫ్లోరోసిస్‌ బారిన పడ్డారు. మునుగోడు, మర్రిగూడ, నాంపల్లి, చండూరు, కట్టంగూరు, చింతపల్లి తదితర ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరోసిస్‌ అధికంగా ఉండటంతో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతిన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఫ్లోరోసిస్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. రూ.3,000 కోట్లతో చేపట్టిన మిషన్‌ భగీరథ పథకం ద్వారా కృష్ణానది నుంచి శుద్ధి చేసిన నీటిని పైప్‌లైన్ల ద్వారా సరఫరా చేస్తోంది. 1,750 గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఇంటింటికీ నల్లా ద్వారా రక్షిత తాగునీరు అందుతోంది. ఈ పథకం జిల్లా ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement