నల్లగొండ : నల్లగొండ జిల్లాలో విద్యారంగం నూతన ఒరవడిని సంతరించుకుంది. గురుకులాల విస్తరణ, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, మెడికల్ కళాశాల ఏర్పాటు, లా, నర్సింగ్ కళాశాలల మంజూరు వంటి చర్యలతో ఉమ్మడి నల్లగొండ జిల్లా విద్యారంగంలో గణనీయమైన పురోగతి సాధించింది. గురుకుల విద్యాసంస్థల విస్తరణతో వేలాది మంది పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు గురుకుల విద్య వ్యవస్థను ప్రభుత్వం అభివృద్ధి చేసింది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 24 ఎస్సీ, 34 బీసీ, 13 మైనార్టీ, 20 గిరిజన గురుకులాలు కొనసాగుతున్నాయి. వీటిలో నాణ్యమైన విద్యతోపాటు ఉచిత వసతి, భోజనం, పోటీ పరీక్షల శిక్షణ ఇస్తున్నారు. పేద కుటుంబాల పిల్లలు నేడు గురుకులాల ద్వారా ఐఐటీలు, ఎన్‌ఐటీలు, మెడికల్ కళాశాలలు, విదేశీ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు.


