స్టాంప్‌ కష్టాలు | - | Sakshi
Sakshi News home page

స్టాంప్‌ కష్టాలు

Jun 1 2026 7:17 AM | Updated on Jun 1 2026 7:17 AM

మిర్యాలగూడ : నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్ల కొరత తీవ్ర రూపం దాల్చింది. నల్లగొండ జిల్లా పరిధిలో నాలుగు నెలలుగా రూ.20, రూ.100 విలువ గల నాన్‌ జ్యుడిషియల్‌ బాండ్‌ పేపర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో సామాన్యులు, న్యాయవాదులు, డాక్యుమెంట్‌ రైటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో స్టాంప్‌ పేపర్లు దొరకక ప్రభుత్వ, ప్రైవేట్‌ పనులు నిలిచిపోతుండడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిలిచిపోతున్న పనులు..

ప్రస్తుతం సాధారణ అఫిడవిట్లు, వివిధ రకాల వ్యాపార ఒప్పంద పత్రాలు, బ్యాంకు రుణాలు, అగ్రిమెంట్లు, కోర్టు సంబంధిత లీగల్‌ పత్రాల తయారీ కోసం రూ.20, రూ.100 నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్లు అత్యంత కీలకం.జిల్లాలోని ప్రధాన కేంద్రాల్లో ఈ పేపర్లు లభించకపోవడంతో ప్రజలు గంటల తరబడి స్టాంప్‌ విక్రేతల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా స్టాక్‌ అందుబాటులో లేకపోవడంతో అత్యవసర పనులు ఉన్న వారు పొరుగున ఉన్న ఇతర జిల్లాలకు వెళ్లి అదనపు ఖర్చులతో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.

కృత్రిమ కొరత... బ్లాక్‌ మార్కెట్‌ హవా

జిల్లాలో సుమారు 200 మంది స్టాంప్‌ వెండర్లు ఉన్నారు. ప్రస్తుతం బాండ్‌ పేవర్ల కొరతను ఆసరాగా చేసుకోని కొందరు స్టాంప్‌ వెండర్లు కృత్రిమ కొరతను సృష్టిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అవసరాన్ని బట్టి రూ.100 స్టాంప్‌ పేపర్లను నిబంధనలకు విరుద్ధంగా రూ.200 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో బహిరంగ దోపిడీ జరుగుతున్నా సంబంధిత రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ అధికారులు ఎలాంటి తనిఖీలు చేపట్టడం లేదని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

పర్యవేక్షణ లోపమే కారణమా..

తెలంగాణ స్టాంప్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖకు చెందిన అధికారిక ఆన్‌లైన్‌ పోర్టల్‌లోనూ నాన్‌ జ్యుడిషియల్‌ స్టాంప్‌ పేపర్ల స్టాక్‌ చాలా తక్కువగా చూపిస్తుందని స్టాంప్‌ వెండర్లు పేర్కొంటున్నారు. పైనుంచి సరఫరా వ్యవస్థలో తీవ్ర లోపాలు ఉన్నాయని, దానికి తోడు జిల్లా స్థాయిలో సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ సమస్య మరింత జటిలంగా మారిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో నెలకొన్న స్టాంప్‌ పేపర్ల సంక్షోభంపై ప్రభుత్వం, ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని న్యాయవాదులు, డాక్యుమెంట్‌ రైటర్లు కోరుతున్నారు.

ఫ నాలుగు నెలలుగా

నాన్‌ జ్యుడిషియల్‌ బాండ్‌ పేపర్ల కొరత

ఫ నిలిచిపోతున్న అగ్రిమెంట్లు

ఫ బ్లాక్‌లో ఎక్కువ రేటుకు విక్రయాలు

ఫ పట్టించుకోని రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement